ss

ss
my

10, మే 2020, ఆదివారం

చిత్రాంగి

చిత్రాంగి
@@@

 ఇది ఒక కల్పనా పాత్ర అనుకుంటున్నాను.   వాస్తవం కూడా కావచ్చేమో తెలియదు. అయితేనేం?  ఇందులో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.  

రాజమహేంద్రవరమును పాలించే రాజరాజ నరేంద్రుడు వృద్ధాప్యంలో చిత్రాంగి అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు.   రాజు వృద్ధుడు కావడం తో ఈమె శారీరిక కోరికలు తీరడం లేదు.  విరహం తో వేగిపోతుండేది.  రాజుగారి చిన్న భార్య కావడం తో స్వేచ్ఛగా బయటకి వెళ్లి తిరగడానికి వీలు లేదు.  ఈమెను ఒక పెద్ద భవంతిలో ఉంచి అప్పుడుడప్పుడు రాజు వచ్చి వెళ్తుండేవాడు.  

  రాజుగారికి పెద్ద భార్య వలన సారంగధరుడు అనే కొడుకు ఉన్నాడు,  అతడు అందగాడు.  మంచి యవ్వనంలో ఉన్నాడు.  ఒకరోజు అతను పావురాలతో ఆడుకుంటుండగా ఒక పావురం ఎగిరిపోయింది.  అతడు దానిని వెతుక్కుంటూ వెళ్ళాడు.  ఆ పావురం చిత్రాంగి భవనంలో వాలింది.  సారంగుడు భవనం లొపలకి వెళ్ళాడు.  చిత్రాంగి ఇతడిని చూసింది.  అంతవరకు ఆమె సారంగుడిని చూడలేదు.  అందగాడు అయిన కుర్రాడిని చూడగానే  ఆమెకు మోహం కలిగింది.  అతడిని కూర్చోబెట్టి ఆతిధ్యం ఇచ్చి చివరకు తన కోరిక తీర్చమని కోరింది.  సారంగుడు నివ్వెరపోయి... తాను కొడుకు లాంటివాడిని అని, కొడుకు మీద కామావేశం మహాపాతకం అని చెప్పి వెళ్ళిపోబోతుండగా ఈమె బలవంతం చేసింది. సారంగుడు కోపంతో వెళ్లిపోతుండగా ఈమె అతని ఉత్తరీయాన్ని పట్టుకుని లాగింది.  దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు సారంగుడు. 

 చిత్రాంగి తోక తొక్కిన తాచులా పరాభవాన్ని, మనసులో లావాలా పొంగుతున్న కామకోరికను తట్టుకోలేక దహించుకుని పోయింది.   రాత్రికి నరేంద్రుడు రాగానే రాజకుమారుడు తన మందిరానికి వచ్చి తనను బలాత్కారం చెయ్యబోయాడని ఫిర్యాదు చేసింది.  రాజు నమ్మలేదు.    సాక్ష్యంగా సారంగుడి ఉత్తరీయాన్ని చూపించింది.   విచక్షణ మరచిన నరేంద్రుడు భటులను పిలిచి, కొడుకు అని కూడా చూడకుండా రేపు సూర్యోదయం లోగా  ఉరి తీయమని ఆదేశించాడు.  రాజాజ్ఞ ను పాలించి భటులు మరుసటి వేకువజామున సారంగుని ఉరి తీశారు.  

****

పై కథ నుంచి ఏమి నేర్చుకోవాలి?  

  ఏ ఇంట్లో అయినా, స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు పరాయి పురుషులు ఆ ఇంట్లో ప్రవేశించరాదు.  అందునా మాతృసమానురాలి ఇంట్లో అడుగు పెట్టరాదు. అలాగే పురుషుడు ఒంటరిగా ఉన్నప్పుడు వేరే ఇంటి స్త్రీ ఆ ఇంట్లోకి వెళ్ళకూడదు.  తల్లీ కొడుకులు కూడా ఒకే గదిలో ఉండరాదు అంటాడు ధర్మరాజు మహాభారతంలో.  అలాగే పురుషులు అపరిచిత  స్త్రీలతో అతి చనువు పెంచుకోరాదు.  కొందరు స్త్రీలు నిర్మలమైన మనసుతో  చనువుగా మాట్లాడవచ్చు.  అంతమాత్రాన  ఆ చనువును మరో రకంగా అర్ధం చేసుకోకూడదు.

 అలాగే వయసుడిగిన వృద్ధులు  తమ కూతురు వయసున్న స్త్రీలను పెళ్లి చేసుకొని వారి జీవితాలను నాశనం చెయ్యకూడదు.   ప్రేమ గొప్పది    కామం మహా నీచమైనది.  

  అపరిచిత స్త్రీ పురుషుల మధ్య ఫోన్ సంభాషణ, చాటింగ్ మంచిది కాదు.  వ్యవహరం అడ్డం తిరిగినపుడు ఆ చాటింగ్స్ ఉరి తాళ్ళు అవుతాయి.

 ఇదే చిత్రాంగి కథ నుంచి మనం తెలుసుకోవలసినది.

కామెంట్‌లు లేవు: