ss

ss
my

10, మే 2020, ఆదివారం

నాడీజంఘుడు

నాడీజంఘుడు 

@@@

ఇది భారతం లోని ఒక కథ.  నాడీజంఘుడు ఒక బకశ్రేష్ఠుడు.  అనగా కొంగ జన్మ ఎత్తినా, జ్ఞానసంపద, పూర్వజన్మ సువాసనలు, బుద్ధి బలం కలిగిన అత్యుత్తమ జీవి. సృస్తికర్త అయిన బ్రహ్మకు ఇతనికి గాఢమైత్రి ఉన్నది. ఒక మహా మర్రివృక్షం లోని తొర్రలో ఇతని నివాసం.

గౌతముడు అనే ఒక బ్రాహ్మణుడు తన కులమర్యాదను విసర్జించి మాంస మాంద్యాలు సేవిస్తూ, వేశ్యాలంపటుడై చరిస్తుండేవాడు.     డబ్బు కోసం ఇతరులను మోసం చేస్తూ, దోపిడీలు కూడా చేస్తుండేవాడు.  యితడు ఒకరోజు అడవిలో తిరుగుతుండగా  ఒక మదపుటేనుగు వెంటపడ్డది.     యితడు ప్రాణభయం తో పారిపోతూ నాడీజంఘుడి నివాసం అయిన మర్రిచెట్టు తొర్రలో దూరాడు.  నాడీజంఘుడు ఇతనికి అభయం ఇచ్చి అన్నం పెట్టి ఆదరించాడు.  ఏనుగు వెళ్లిపోగానే గౌతముడు బయలుదేరాడు.

  "బ్రాహ్మణోత్తమా...విప్రులు ఇంటికి వచ్చినపుడు ఏమీ ఇవ్వకుండా పంపించటం ధర్మవిరుద్ధం.  నేను కొంగను కావడం వల్ల నాదగ్గర ధనం లేదు.  సమీపం లో ఉన్న మధువజ్రపురం అనే గ్రామంలో విరూపాక్షుడు అనే రాక్షసుడు ఉన్నాడు.  అతను నా మిత్రుడు.  అతనిదగ్గరకు వెళ్లి అడగండి.  కావలసినంత ధనమ్ ఇస్తాడు"  అని చెప్పి పంపాడు.  

  గౌతముడు ఆశతో విరూపాక్షుని ఇంటికి వెళ్ళాడు.  గౌతముని చూడగానే వీడు దుర్మార్గుడు, కులం తప్పినవాడు అని గ్రహించి ధనం ఇవ్వకూడదు అనుకున్నప్పటికీ, నాడీజంఘుని మాట తీసివెయ్యలేక డబ్బు ఇచ్చాడు.  వెళ్తూ వెళ్తూ యితడు మళ్ళీ నాడీజంఘుని నివాసానికి వచ్చి డబ్బు మూటలు అక్కడ పెట్టి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు.  నిద్రలోకి జారుకున్న గౌతముడ్ని తన రెక్కలతో విసిరి కొంచెం సేపు తరువాత తాను కూడా విశ్రమించింది.  

  గౌతముడుకి మెలకువ రాగానే నాడీజంఘుని బలిసిన శరీరాన్ని చూసి నోరూరి కొంగను చంపి ఆ మాంసం వండుకుని తినేసాడు. రోజూ తన ఇంటికి వచ్చి కాసేపు ముచ్చటించే నాడీజంఘుడు ఆరోజు రాకపోవడం తో అనుమానం వచ్చిన విరూపాక్షుడు తన సేవకులను మర్రిచెట్టు దగ్గరకు పంపాడు.  అక్కడ గౌతముడు ఉండటం చూసి అతనిపై అనుమానం కలిగి నాలుగు తన్నడంతో కొంగను చంపితిన్నట్లు ఒప్పుకున్నాడు.  విరూపాక్షుడు ఆగ్రహం తో గౌతముడ్ని చంపమని సేవకులకు ఆదేశాలు ఇచ్చాడు.  అటువంటి విశ్వాసఘాతకుడిని చంపితే తమకు మహాపాపం చుట్టుకుంటుంది అని సేవకులు నిరాకరిస్తారు.  అప్పుడు గౌతముని చీల్చి ముక్కలుముక్కలు చెయ్యమని తన పెంపుడు శునకాలను ఉసిగొల్పాడు విరూపాక్షుడు.  అయితే కృతఘ్నుడు యొక్క మాంసం ముట్టడం కూడా దోషం అని ఆ కుక్కలు కూడా అందుకు నిరాకరిస్తాయి.  

  అప్పుడు  నాడీజంఘుడిని స్వర్గం తీసుకెళ్లడానికి ఇంద్రుడు తన సురభి (కామధేనువు) తో వచ్చాడు.  అదే సమయం లో తన మిత్రుడికి శ్రద్ధాంజలి ఘటించడానికి విధాత కూడా అరుదెంచాడు.  సురభి తన దూడకు పాలు ఇస్తుండగా, ఆ పాల నురుగు గాలికి వెళ్లి నాడీజంఘుడి కళేబరం మీద పడ్డది.    వెంటనే నాడీజంఘుడు మళ్ళీ బ్రతికాడు.  ఇంద్రుడు కోపంతో బ్రాహ్మణుని శిక్షించబోగా నాడీజంఘుడు వారించి అతనిని క్షమించమని కోరగా అందుకు ఇంద్రుడు అంగీకరించాడు.  

                     *** 

 పై కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి పాఠం ఏమిటి?  

కృతఘ్నత అనేది బ్రాహ్మణహత్య కన్నా మహా పాతకం.  కృతఘ్నుని శరీరాన్ని కుక్కలు కూడా ముట్టుకోవు.  తమను జీవితం లో ఆదరించి, తమ అభివృద్ధి కి దోహదం చేసిన కొందరు మహామనీషులకు అలవోకగా ద్రోహం చేస్తారు కొందరు విశ్వాసహీనులు.  ఈనాటి రాజకీయాలలో ఇలాంటి మిత్రద్రోహులను, విశ్వాసహీనులను అనేకమందిని చూస్తున్నాము.  ఒక పార్టీ జెండా మోసి ఎన్నికలలో గెలిచి, వెంటనే మరో పార్టీలో చేరిపోయే వారు, తమను ఆదరించి పైకి తెచ్చినవారి పట్ల అవాకులు చెవాకులు పేలేవారు,  తమను నమ్మి అవసరాల్లో ఆదుకుని పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయిస్తే, చివరకు వారి వ్యాపారాలనే దెబ్బతీసేవారు, వారినే విమర్శించేవారు, బంధువు అని చేరదీస్తే, వారికే వెన్నుపోట్లు పొడిచేవారు, ఈ గౌతముడి కోవలోకి వస్తారు.  

  నమ్మిన వారు ద్రోహం చేసినా కొందరు పెద్దమనసుతో క్షమిస్తారు.     మంచి మనసున్న వారికి, పరోపకార జీవులకు,  దేవతలు, రాక్షసులు కూడా మిత్రులు అవుతారు.  అయితే ఇలాంటి నాడీజంఘులు ఈ కాలం లో చాలా అరుదు.

కామెంట్‌లు లేవు: