ss

ss
my

10, మే 2020, ఆదివారం

కౌశికుడు

కౌశికుడు 

@@@

   భారతం లోని ఒక కథ ఇది.  

కౌశికుడు ఒక బ్రాహ్మణుడు.  గొప్ప తపశ్శక్తి సంపన్నుడు.  ఒక రోజు చెట్టు కింద కూర్చుని వేదాలను చదువుకుంటున్నాడు.  ఆ చెట్టు పై ఉన్న ఒక కొంగ కౌశికుడి మీద రెట్ట వేసింది.   ఏకాగ్రతకు  భంగం కలగడం తో కోపంగా తలఎత్తి పైకి చూశాడు.  అతని దృక్కుల తీక్షణతకు   ఆ బకం భస్మమై పోయింది. 

 తరువాత అతను భిక్షాటనకై గ్రామం లోకి వెళ్ళాడు.  ఒక ఇంటిముందు నిలిచి "భవతి బిక్షాన్ దేహి "  అని మూడు సార్లు పిలిచాడు.  తలుపు తీయలేదు ఆ ఇంటి ఇల్లాలు.  కౌశికుడు కోపంగా మరో సారి పిలిచాడు. అప్పుడు తలుపు తెరుచుకుంది.  మహాలక్ష్మి లాంటి ఇల్లాలు ప్రసన్నవదనం తో భిక్షతో బయటకి వచ్చింది.  

  "ఎన్ని సార్లు పిలవాలి?  అతిధులు అంటే అంత నిర్లక్ష్యమా? "  అని ఆగ్రహం గా ఆమె వైపు చూశాడు కౌశికుడు. ఆమె చలించకుండా నవ్వుతూ "విప్రోత్తమా.. నా పతి దేవుడు భోజనం చేస్తున్నారు.  ఆయనకు వడ్డన పూర్తి అయిన తరువాత ఆయనకు మంచం వేసి పడుకోబెట్టి పాదసేవ చేసి మీ దగ్గరకు వచ్చాను.  మీ ఆగ్రహజ్వాలకు భస్మం కావడానికి నేను చెట్టు మీది కొంగను కాను"  అన్నది.  

  కౌశికుడు ఆశ్చర్యపోయాడు.  "కొంగ విషయం మీకు ఎలా తెలుసు?"  అడిగాడు.  

  "పతివ్రత అయిన ఇల్లాలికి పతియే ప్రత్యక్ష దైవం.  నాకు ఈ జగత్తు లో పతి తరువాతే ఎవరైనా.  నేను నా ధర్మాన్ని పాటిస్తున్నంత కాలం త్రినేత్రుడి మూడో కన్ను కూడా నన్ను ఏమీ చెయ్యలేదు.  పాండిత్యం తో పాటు జ్ఞానం కూడా అవసరం.   మీరు తెలుసుకోవలసిన ధర్మాలు కొన్ని ఉన్నాయి.  మిథిలానగరం లో ధర్మవ్యాధుడు అనే మహాత్ముడు ఉన్నాడు.  వెళ్లి ఆయనను దర్శించండి"  చెప్పి లోపలకు వెళ్ళింది..  

క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా   కౌశికుడు  మిథిలానగరం వెళ్ళాడు.  అక్కడ ఒక వీధిలో మాంసం అమ్ముతున్న ధర్మవ్యాధుడిని చూసాడు.  మాంసఖండాలు చూసిన అతని శరీరం జలదరించింది.  సందేహిస్తూనే వెళ్ళాడు.  ధర్మవ్యాధుడు అతనిని చూసి "నమస్సులు విప్రవర్యా... మిమ్మల్ని ఆ మహా పత్రివ్రత పంపి ఉంటుంది."  అన్నాడు.  

  కౌశికుడు మరింత ఆశ్చర్యపోయి "జంతు మాంసాలు అమ్మే నీవు ధర్మాలు నాకు బోధిస్తావా? "  అన్నాడు. 

 ధర్మవ్యాధుడు నవ్వి "అయ్యా.. మాంసం అమ్మడం నా వృత్తిధర్మం.  అమ్మకపోతే నా వృత్తికి ద్రోహం చేసినట్లు అవుతుంది.  ఎవరి వృత్తి వారుచెయ్యకపోవడం ధర్మ ద్రోహం అవుతుంది..అలా కూర్చోండి" అని మధ్యాహ్నం కాగానే దుకాణం మూసేసి కౌశికుడిని ఇంటికి తీసుకెళ్లాడు.  

  అక్కడ వృద్ధులైన తల్లితండ్రులు ఉన్నారు.  ధర్మవ్యాధుడు వారి పాదాలకు నమస్కరించి వారికి భోజనం తెచ్చి తినిపించాడు. వారు పడుకున్న తరువాత పాదసేవ చేసి అప్పుడు తాను భోజనానికి ఉపక్రమించాడు.  కౌశికుడికి అంతా అయోమయంగా తోచింది.  

"విప్రవర్యా.. తల్లితండ్రులు దైవం తో సమానం.  మనని కని, పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించడానికి తమ యవ్వనకాలం మొత్తం ధారపోస్తారు.  వారు వృద్ధులు అయిన తరువాత వారి మానానికి వారిని వదిలెయ్యకుండా, వారి సేవ చెయ్యడం, వారిని ఆదరించడం పిల్లల కర్తవ్యమ్.  మీరు వేదాధ్యయనం, తపస్సులు  పేరుతో, జననీజనకులను విస్మరించి మీ ధర్మాన్ని తప్పుతున్నారు. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు.   వారిని నిర్లక్ష్యం చేసి ఎక్కడో దేవుడు ఉన్నాడనుకోవటం అవివేకం"  అని హితవు చెప్పాడు.  

 తన తప్పు గ్రహించి వెంటనే ఇంటిదారి పట్టాడు కౌశికుడు.  

          *** 

పై కథ నుంచి ఏమి నేర్చుకోవాలి?  

 తల్లితండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని సకల త్యాగాలు చేసి తమ పిల్లలను ప్రయోజకులను చేస్తారు.  రెక్కలు వచ్చిన పిల్లలు ఏమి చేస్తున్నారు?.  తల్లితండ్రులను గాలికి వదిలేసి తమ దారి తాము చూసుకుంటారు.  బాగా సంపాదిస్తుంటే తల్లితండ్రులను వృద్ధాశ్రమాలలో వదిలేసి తాము వారిని ఉద్ధరించాము అని తృప్తి పడుతున్నారు.  నిజానికి ఏ తల్లితండ్రులు కూడా కడుపున పుట్టిన పిల్లలకు దూరంగా ఉండాలని కోరుకోరు.  వారు తమ పిల్లల అప్రయోజకత్వాన్ని తలచుకుని విలపిస్తూనే ఉంటారు.  పరిస్థితిలు సహకరించడం లేదు,  మా పెద్దలు మాఇంట్లో ఉండరు లాంటి కుంటిసాకులు చెప్తూ ఆత్మవంచన చేసుకుంటున్నారు.  

  తల్లితండ్రులను ప్రేమగా చూసుకోవడమే పరమధర్మం అని కౌశికుడి కథ బోధిస్తున్నది.

కామెంట్‌లు లేవు: