ss

ss
my

10, మే 2020, ఆదివారం

అవక్రీతుడు

అవక్రీతుడు 

@@@

 

 ఇది భారతం లోని అనేకానేక కథల్లో ఒకటి.  భారద్వాజుని కుమారుడు అవక్రీతుడు.  చిన్నప్పటినుంచి విద్యార్జనలో వెనుక పడ్డాడు.  ఇతని పొరుగునే ఉన్న రైభ్యుడు అనే ముని, ఆయన సంతానం మహా పండితులు.  వారిని చూసి ఇతనికి అసూయ పుట్టింది. చదువుకునే శ్రమ లేకుండా మహా విద్వాంసుడు కావాలని తలచి గంగానది తీరం మీద ఇంద్రుని కోసం ఘోర తపస్సు చెయ్యడం మొదలు పెట్టాడు.  

  కొన్నాళ్ళకు ఇంద్రుడు ఒక వృద్ధుని రూపం లో వచ్చి "నాయనా. విద్య అనేది గురుముఖత నేర్చుకోవాలి.  ఇలా తపస్సు చేసి అడ్డదారుల్లో కాదు.  వెళ్లి చదువుకుని సాధించు" అని సలహా ఇచ్చాడు. "లేదు.  నేను చదువుకోకుండానే నాకు అన్నీ శాస్త్రాలు, విద్యలు రావాల్సిందే.  అప్పటివరకు తపస్సు ఆపను"  అని మళ్ళీ తపస్సులో మునిగి పోయాడు.  

  కొన్నాళ్ల తరువాత మళ్ళీ ఇంద్రుడు వచ్చి హితబోధ చేసాడు.  అయినా అవక్రీతుడు వినలేదు.  అప్పుడు ఇంద్రుడు నిజరూపం తో దర్శనం ఇచ్చి అన్ని విద్యలు అతనికి సంప్రాప్తిస్తాయి అని వరం ఇచ్చి ఒక కమండలం లో మంత్రం జలం ఇచ్చి ఈ కమండలం నీ చేత ఉన్నంతవరకు అన్ని వేదం శాస్త్రాలు నీ అధీనం లో ఉంటాయి" అని వరం ఇచ్చి మాయం అయ్యాడు.  

  ఆ వర గర్వం తో అవక్రీతుడు నేరుగా రైభ్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు.  అక్కడ ఆ మహర్షి  కోడలు ఒంటరిగా కనిపించింది.  అవక్రీతుడు మోహావేశంతో  ఆమెను బలాత్కరించబోయాడు.  ఆమె అరిచి గోల చెయ్యగానే పారిపోయాడు.  రైభ్యుడు వచ్చిన తరువాత జరిగిన విషయం ఆయన తో చెప్పింది కోడలు.  రైభ్యుడు ఆగ్రహించి ఒక రాక్షసుడిని సృష్టించి ఒక సుందరాంగిగా చేసి అవక్రీతుడిని సంహరించమని ఆదేశించాడు.  ఆ మాయ సుందరాంగి అవక్రీతుడిని మెప్పించి కమండలం ఇవ్వమని కోరింది.  కామావేశం లో ఉన్న అవక్రీతుడు కమండలాన్ని ఇచ్చేసాడు.  వెంటనే సుందరాంగి రాక్షసి గా మారి అవక్రీతుడిని చంపబోయింది.  

 భయకంపితుడు అయిన అవక్రీతుడు పారిపోయి సముద్రం లోకి దూకాడు.  వెంటనే సముద్ర జలం మొత్తం ఇంకి పోయింది. అక్కడినుంచి పరుగు తీసి తండ్రి ఒక యాగం చేస్తుంటే వెళ్లి యాగాగ్ని లో దూకాడు.  వెంటనే అగ్ని హోత్రం మొత్తం చల్లబడి పోయింది.  అప్పుడు రాక్షసి అవక్రీతుడిని సంహరించింది.  

 పుత్ర శోకం తో ఉన్న భారద్వాజుని గమనించి అక్కడకు వచ్చిన ఆర్వావసువు అనే దేవత ప్రార్ధించగా  దేవతలు ప్రత్యక్షమై అవక్రీతుడిని బ్రతికించారు.  

  "అన్ని శాస్త్రవిద్యలు కలిగిన నన్ను రైభ్యుడు ఎలా చంపగలిగాడు" అని తండ్రిని ప్రశ్నించాడు.  "రైభ్యుడు గురుముఖతా శాస్త్రాలను అభ్యసించాడు.  విద్యార్జన కోసం అహర్నిశలు కష్టపడ్డాడు.  నీకు అప్పనంగా విద్య లభించింది.  అందువలన నీకు అహంకారం, మదం, మాత్సర్యం పెరిగాయి.  విచక్షణ కోల్పోయావు.  అందువల్లనే నీ విద్య నిన్ను రక్షించలేక పోయింది"  బదులిచ్చాడు భారద్వాజుడు.  

    ***** 

ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి?  

విజయానికి అడ్డదారులు లేవు.  విద్యలో అయినా, వ్యాపారం లో అయినా, చిత్తశుద్ధితో అహర్నిశలు కష్టపడాలి.  అజీజ్ ప్రేమ్ జి, అంబానీ, నారాయణ మూర్తి, అక్కినేని, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఉన్నత స్థాయికి  చేరుకోగలిగారు  రాత్రింబవళ్లు వారి అకుంఠిత దీక్ష ఉన్నది.  ఇవాళ స్కూల్లో చేరి, రేపటికి కేంబ్రిడ్జ్ పట్టా కావాలంటే రాదు.  ఇవాళ చిన్న వ్యాపారం మొదలు పెట్టి నెలరోజుల్లో బిర్లా, టాటా అంతవారు కావాలని ఆశపడితే కాలేవు.  

 ఇతరుల విద్య,  సంపదలు, ప్రతిష్ట చూసి అసూయ పడితే అది మనిషి పతనానికి దారి తీస్తుంది.  

 అయాచితంగా వచ్చే చదువుకు, ధనానికి విలువ ఉండదు.  పైగా మనిషిలో అహంకారాన్ని పెంచుతుంది.  సాటి మనుషుల మీద చిన్న చూపు ఏర్పడుతుంది.  కస్టపడి పైకి వస్తే మనిషికి కష్టం విలువ, చెమట ఖరీదు తెలుస్తుంది.  అప్పుడు సమాజం లో ఎలా జీవించాలో అవగతం అవుతుంది.  

ఇదే అవక్రీతుడి చరిత్ర బోధిస్తున్న నీతి.

కామెంట్‌లు లేవు: