ss

ss
my

10, మే 2020, ఆదివారం

ఆషాఢభూతి

ఆషాఢభూతి 

@@@

          ****

 చాలామందికి ఆషాఢభూతి పేరు పరిచితమే.  అయితే ఆషాఢభూతి అసలు కథ తెలిసిన వారు ఈతరం లో అతి కొద్దీ మందే ఉంటారు.  ఆషాఢభూతి పాత్ర విష్ణుశర్మ విరచిత పంచతంత్రం లోనిది.  ఈ పాత్ర మనకు చెప్పే నీతి సర్వకాల సర్వావస్థల యందు గుర్తుంచుకోదగినది.  

కాశ్మీరదేశం లో దేవశర్మ అనే ఒక సన్యాసి ఉన్నాడు.  అతను పరమలోభి.  ఎంగిలిచేత్తో కాకిని విదిల్చడు.  భిక్షాటన ద్వారా వచ్చే డబ్బును అంత ఒక బొంతలో దాచిపెడుతూ, నిద్రలో కూడా ఆ బొంతను వదలడు.  ఒకరోజు ఆషాఢభూతి అనే పోరంబోకు ఈ సన్యాసి తన ధనాన్ని తనివితీరా చూసుకుంటూ మళ్ళీ ఆ బొంతలో దాచిపెట్టడం గమనించాడు.  ఒకసారి దాన్ని దొంగిలించాలని ప్రయత్నించాడు కానీ దేవశర్మ అతి జాగ్రత్త కారణంగా వీలుపడలేదు.  దాంతో కపటోపాయం తో అహఁయినా దాన్ని దొంగింలించాలని తలచి పొద్దున్నే  శుభ్రంగా స్నానం చేసి ఒంటినిండా విభూతి రాసుకుని కేవలం ఒక పంచె మాత్రమే ధరించి పరమభక్తుడు వలే దేవశర్మ దగ్గరికి వెళ్ళాడు.  

 దేవశర్మ కు సాష్టాంగ ప్రమాణం చేసి "అయ్యా... శరీరసౌఖ్యాలు బుద్బుదప్రాయం.  ఎదో ఒకనాటికి జీవి గిట్టక తప్పదు.  ఈ కొద్దీ సమయం లోనే అనేక పాపాలు చేస్తాడు.  అందులో ధనసంపాదన ఒకటి.  ధనం నా దృష్టిలో చీపురు పుల్ల లాంటిది.  జీవితం మీద వైరాగ్యం తో భార్యాపిల్లలను వదిలేసి మీవంటి మహనీయుల సేవలో జీవితాన్ని చాలించాలని మీ పాదాలను ఆశ్రయించాను.  నాకు మీరే దిక్కు." అన్నాడు.  

 ఆషాఢభూతి తీయని మాటలను నమ్మి అతడిని తన శిష్యుడిగా స్వీకరించాడు దేవశర్మ.  బయటకు వెళ్తున్నప్పుడు అనేక బరువులను ఆషాఢభూతి కి ఇస్తున్నాడు కానీ, బొంత మాత్రం యివ్వడం లేదు దేవశర్మ.  ఒక రోజు దేవశర్మ చూస్తుండగా, తన పంచెను పట్టుకుని "గురుదేవా... గురుదేవా... నా పంచెకు ఎదో పరాయి వారి వస్తువు పట్టుకున్నది.  నాకు నరాలు వణికిపోతున్నాయి.  పరులసొమ్ము ముట్టుకోవడం మహాపాపం.  ఆ మహాపాపం తో నా గుండె బద్దలు కాకముందే పంచెకు అంటుకున్న ఆ పాపిష్టి సొమ్మును తీసివేసి నన్ను రక్షించండి"  అని కేకలు పెట్టాడు.  దేవశర్మ అపుడు పంచెను వెతకగా, ఒక చీపురు పుల్ల పంచెను పట్టుకుని కనిపించింది.  దేవశర్మ నవ్వి " శిష్యా... చీపురు పుల్ల తప్ప ఏమీ లేదు" అన్నాడు. "చీపురు పుల్ల అయినా సరే.. పరుల సొమ్ము పాపిష్టిది.  తీసెయ్యండి" అని కేకలు పెట్టాడు ఆషాఢభూతి.  దేవశర్మ నవ్వుతూ పుల్లను తీసెయ్యగానే ఆషాఢభూతి హాయిగా నిట్టూర్చాడు.   ఆషాఢభూతి నిజాయితీ కి ఆశ్చర్యపోయాడు దేవశర్మ.  

  ఒకనాడు గురుశిషులు ఇద్దరూ ఒక చెరువుకు వెళ్లారు.  "శిష్యా... నేను స్నానం చేసి వస్తాను.  ఈ బొంతను భద్రంగా చూస్తుండు" అని చెరువులో దిగాడు దేవశర్మ.  అతను గొంతు లోతువరకు దిగగానే,  బొంత ను తీసుకుని పారిపోయాడు ఆషాఢభూతి.  

  @@ 

 పై కథలో నీతి ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  

 మనలను మోసం చెయ్యడానికి ఎన్నెన్నో నాటకాలు ఆడుతుంటారు మోసగాళ్లు.  అమలుచేయడానికి ఏమాత్రం వీలుగాని వాగ్దానాలు చేసి అధికారం లోకి రాగానే,  ఆ ప్రజలనే అణిచివేసే ఆషాఢభూతులు దేశం లో రాజకీయరంగం లో ఎక్కువగా కనిపిస్తారు.  ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మకూడదు.  మన బుర్రను కూడా ఉపయోగించాలి.  ఒక చీరె కొంటె మరో చీర ఉచితం, టీవీ కొంటె ఫోన్ ఉచితం, ఒకటి కొంటె మరొకటి ఉచితం, అనే ఆషాఢభూతులు వ్యాపార రంగం లో ఉంటారు.  అసలు ఉచితంగా ఎలా ఇస్తారు అనే జ్ఞానం కూడా లేకుండా వారిబారిన పడి మోసపోయేవారికి లెక్కే ఉండదు.  అలాగే చిట్టీలు వేస్తాము, స్కీములు వేస్తాము, ఇప్పుడు లక్ష కడితే, రెండేళ్లలో రెండు లక్షలు ఇస్తాము అనే ఆషాఢభూతులకి కొదువ లేదు.  

తనను నమ్మి పిల్లను ఇచ్చిన మామను వంచించిన ఒక ప్రముఖ వ్యక్తి ఈ పాత్ర కోవలోకే వస్తాడు.

  మన సమాజం లో మనమధ్యనే ఉండే ఆషాఢభూతుల బారిన పడకుండా మన మెదడు ఉపయోగించాలి అని ఆషాఢభూతి చరిత్ర స్పష్టం చేస్తుంది.

కామెంట్‌లు లేవు: