ss

ss
my

16, మే 2020, శనివారం

అంబరీషుడు

అంబరీషుడు 

              @@@

ఇది భాగవతంలోని ఒక చిన్న ఉపకథ.  

నాభాగుడు అనే మునిపుంగవుని కుమారుడు అంబరీషుడు.  సత్యనిష్టాగరిష్టుడు.  మహా పండితుడు.  ధర్మాధర్మ విచక్షణ తెలిసినవాడు.  అతిధి అభ్యాగతులను ఆదరించేవాడు.  ఎవరో ఒక అతిధిని ఆహ్వానించి భోజనం పెట్టకుండా తాను భోజనం చేసేవాడు కాదు.  ఇతని సత్యసంధతకు, ధర్మగుణానికి మెచ్చి త్రిమూర్తులు సైతం ప్రసన్నంగా ఉండేవారు.  

ఒకరోజు అంబరీషుడు ద్వాదశీవ్రతాన్ని ఆచరించి కొందరు బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానించి వారి ఆశీర్వాదాలు పొందిన తరువాత భోజనస్వీకరణకు సంసిద్ధులు అయ్యాడు.  ఆ సమయంలో దుర్వాస మునీంద్రుడు అరుదెంచాడు.  అంబరీషుడు ఆయనకు వినయంగా నమస్కరించి, పాదపూజ చేసి, సమీపంలోని నదికి వెళ్లి స్నానం చేసి వచ్చి తమతో కలిసి భోజనం చెయ్యమని కోరాడు.  సరే అని నదీస్నానానికి వెళ్ళాడు దుర్వాసుడు.  

అయితే ఆయన ఎంతసేపటికీ తిరిగిరాలేదు.  ద్వాదశీవ్రత ఫలితాన్ని ప్రసాదించే పుణ్యఘడియలు దాటిపోతున్నాయి.  దుర్వాసుడు రాకుండా భోజనం చేస్తే మహాపాపమే కాక, ఆయన ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.   దాంతో ఆందోళన చెందిన అంబరీషుడు బ్రాహ్మణులను సలహా కోరుతాడు.  ఉదకపానం గావిస్తే వ్రతఫలితం దక్కుతుందని, భోజనం చెయ్యలేదు కాబట్టి ఆయన కోపాన్ని తప్పించుకోవచ్చని సలహా ఇస్తారు బ్రాహ్మణులు.  ఆ సలహా ప్రకారం మంచినీటిని సేవిస్తాడు అంబరీషుడు.  

అప్పుడు దుర్వాసుడు వచ్చి తాను లేకుండా అంబరీషుడు ఉదకపానం గావించిన విషయం తెలుసుకుని ఆగ్రహించి తన తప్పశ్శక్తితో ఒక రాక్షసిని సృష్టించి అంబరీషుడిని మింగివేయాల్సిందిగా ఆదేశిస్తాడు.  రాక్షసి అంబరీషుడిని సమీపించేంతలో విష్ణుమూర్తి ప్రయోగించిన సుదర్శన చక్రం అడ్డువచ్చి రాక్షసిని సంహరించి దుర్వాసుని వెంటపడుతుంది.  దుర్వాసుడు ప్రాణభయంతో పారిపోయి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల లోకాలకు వెళ్లి ప్రాణాన్ని రక్షించమని కోరుతాడు.  అయితే వారు అందుకు నిరాకరించి నువ్వే వెళ్లి అంబరీషుని పాదాలమీద పడి శరణుకోరి ప్రాణాలు కాపాడుకోమని సలహా ఇస్తారు.  దుర్వాసుడు భూలోకం వెళ్లి అంబరీషుని కాళ్ళమీద పడి శరణు వేడగా అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తాడు.  చక్రం వెనక్కు వెళ్ళిపోతుంది.  

***

పై కథ మనకు అనేక నీతులు బోధిస్తుంది.  

మనకు ఎన్ని సిరులు, సంపదలు ఉన్నప్పటికీ, గర్వించకుండా పేదలపట్ల కరుణాభావంతో వర్తించాలి.  అతిధులను సమాదరించాలి.  

మన భక్తిలో చిత్తశుద్ధి ఉంటే, మనను భగవంతుడు రక్షిస్తాడు.  మనలో మంచితనం ఉంటే, స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగులు కూడా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ముందుకొస్తారు.  మన ప్రవర్తన సరిగ్గా లేకపోతె మనం ఇతరుల కోపాలకు బలిఅవుతాము.  

మనలను ఎవరైనా భోజనానికి పిలిచినప్పుడు భోజన సమయానికి అరగంట ముందే హాజరవ్వాలి.  వారు మనకోసం ఎదురు చూస్తారా చూడరా అని పరీక్షించరాదు.  కొంతమంది కావాలనే పిలిచిన టైముకు వెళ్లకుండా పదిసార్లు ఫోన్ చేయించుకుంటారు.  అవతలి వ్యక్తులను టెన్షన్లకు గురి చేస్తారు.  ఒకవేళ మనం వెళ్ళడానికి ఆలస్యం అయ్యే పక్షంలో హోస్టులకు ఫోన్ చేసి చెప్పి వారిని భోజనం కానివ్వమని చెప్పాలి.  ఎందుకంటే బీపీ, సుగర్ల కాలం ఇది.  సమయానికి ఆహారం తీసుకోకపోతే కోమాలోకి వెళ్లాల్సి వస్తుంది.  మనం ఆలస్యంగా వెళ్లి వాళ్ళ మీద పోట్లాడితే అది మన విలువను తగ్గిస్తుందని గ్రహించాలి.

కామెంట్‌లు లేవు: