ss

ss
my

10, మే 2020, ఆదివారం

అష్టావక్రుడు

అష్టావక్రుడు 

@@@

ఇది విష్ణుపురాణం లో చెప్పబడిన ఒక చిన్న కథ.  

ఏకపాదుడు అనే పేద బ్రాహ్మణుడు భార్యతో కలిసి ఒక గ్రామం లో నివసిస్తుంటారు.  పదిమంది పిల్లలకు వేదాలు నేర్పుతూ జీవిక సాగిస్తుంటాడు.  అతని భార్య ఎనిమిదినెలల గర్భం తో ఉన్నది. ఆ సమయం లో ఏకపాదుడు పిల్లలకు వేదాలు వల్లె వేయిస్తుండగా గర్భస్థ శిశువు కూడా ఆలకిస్తున్నది. పిల్లలు పదేపదే వేదాలను వల్లెవేస్తుంటే "ఒక్కొక్కటి ఎన్నిసార్లు చెప్తావు?  ఆ పిల్లలు చెప్పలేక నీరసపడి పోతున్నారు"  అన్నది ఏకపాదుడితో. 

  ఏకపాదుడికి ఆగ్రహం కలిగింది.  విచక్షణ కోల్పోయి "ఎనిమిదో నెలలో గర్భంలోనే ఉండీ  వేదాల గూర్చి వక్రంగా మాట్లాడావు కాబట్టి ఎనిమిది వంకరలతో జన్మిస్తావు" అని శపించాడు.  

  గర్భవతి అయిన భార్యకు సరైన పోషణ లేకపోవడం తో నీరసించి పోతుండటం తో "అలా రాజసభకు వెళ్లి పండితచర్చలు చేసి నాలుగు డబ్బులు సంపాదించుకుని రా"  అని బంధువులు సలహా ఇచ్చారు.  సరే అని ఏకపాదుడు ఆ రాజ్య మహారాజు అయిన జనకుడి రాజసభకు వెళ్ళాడు. 

  ఏకపాదుడి భార్య ప్రసవించింది.  బాలుడు దేహం లో ఎనిమిది వంకరలతో జన్మించాడు.  కావున అతడికి అష్టావక్రుడు అని నామకరణం చేశారు.  ఇల్లు గడవకపోవడం తో అతడి మేనమామ ఉద్దాలకుడు  వచ్చి అష్టావక్రుడిని తన ఇంటికి తీసుకెళ్లి పోషించసాగాడు.  అతనికి శ్వేతకేతుడు అనే కొడుకు ఉన్నాడు.  అష్టావక్రుడు, శ్వేతకేతుడు సమవయస్కులు. ఇద్దరూ గురుకుల ఆశ్రమంలో వేదాలు, పురాణాలు, కావ్యాలు చదువుకుంటున్నారు.    ఒకరోజు అష్టావక్రుడు మేనమామ తొడపై కూర్చుని చదువుకుంటున్నాడు.  అప్పుడు శ్వేతకేతుడు "మా తండ్రి గారి తొడమీద కూర్చునే అర్హత నీకులేదు.  దిగిపో" అని కిందికి తోసేసాడు.  

  అప్పుడు అష్టావక్రుడు ఏడుస్తూ ఇంటికి వచ్చి తల్లి ని అడిగి తన తండ్రి జనకుడి సభకు వెళ్లి తిరిగి రాలేదు అని తెలుసుకుని జనకుడి సభకు వెళ్ళాడు.  జనకుడి ఆస్థానం లో వంది అనే మహాపండితుడు ఉన్నాడు.  అతని తో పోటీపడి ఓడిపోయి ఏకపాదుడు చెరసాలలో ఉన్న విషయం తెలుసుకుని తానూ వంది తో పోటీ పడతాను అన్నాడు.  దేహం అంతా వంకరలతో ఉన్న బాలుడైన అష్టావక్రుడిని చూసి సభలో అందరూ అవహేళన చేస్తారు.  

  అయినా వెరవకుండా అష్టావక్రుడు... వంది తో చర్చలో పాల్గొని మందిని పరాజయం పాలుచేస్తాడు.  జనకుడు సంతోషించి ఏకపాదుడిని విడిచిపెట్టడమే కాకుండా భూరిగా ధనం బహుమతిగా ఇచ్చి పంపిస్తాడు.  

                 ****** 

 పై కథ వలన మనం తెలుసుకోవాల్సిన నీతి ఎంతో ఉన్నది.  

గర్భస్థ శిశువుకు కూడా గ్రహణ శక్తి ఉంటుంది అని ఆనాడే మన శాస్త్రవేత్తలు గుర్తించారు.    ఎప్పుడైనా, ఎంత కోపంలో అయినా పిల్లలకు శాపాలు పెట్టరాదు.  ఓ 50  ఏళ్ళక్రితం వరకూ ఒక్కొక్కరు పదిమంది పిల్లలను కనేవారు.  అందరిని పోషించేవారు.  ఇవాళ ఒక్కరిద్దరు పిల్లలను కూడా కనలేక అల్లాడిపోతున్నారు.  ఆ పిల్లలను నానాతిట్లూ తిడుతుంటారు.  

 శారీరక వైకల్యాలు చూసి తక్కువ అంచనా వెయ్యకూడదు.  వారిలో కూడా బుద్ధికి బృహస్పతులు ఉంటారు.  మనం చూస్తున్నాం, రెండు కళ్ళు లేనివారు, కాళ్ళు లేనివారు, చేతులులేనివారు, కూడా చదువుల్లో, క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నారు.  అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చుకుంటున్నారు.  వైకల్యాలు చూసి పరిహాసం చెయ్యడం, చిన్నచూపు చూడటం తగని పని అని అష్టావక్రుడు కథ మనకు బోధిస్తున్నది.

కామెంట్‌లు లేవు: