ss

ss
my

10, మే 2020, ఆదివారం

ఇంద్రద్యుమ్నుడు

ఇంద్రద్యుమ్నుడు 

@@@

     *****  

భారతం లోని ఒక కథ ఇది.  

 ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు  అనే రాజు ఉండేవాడు.  యితడు అనేక మంచి కార్యక్రమాలు చెయ్యడం తో ప్రజలు అందరూ ఇతని గూర్చి ప్రశంసాపూర్వకంగా చెప్పుకునే వారు.  అనేక సంక్షేమ పధకాలు, శాశ్వత పధకాలు ఇతను అమలు చేసాడు.  ఆ పుణ్యఫలితంగా దేవేంద్రుడి నుంచి ఇతనికి స్వర్గలోక నివాసం చెయ్యమని ఆహ్వానం వచ్చింది.   ఇంద్రద్యుమ్నుడు స్వర్గలోకము  వెళ్లి అక్కడ సభలో కూర్చుని దేవకన్యల నాట్యాలు, మహా ఋషుల బోధనలు,  దేవతల దర్శనాలతో కాలం గడుపుతున్నాడు.  

  అయితే కొన్ని ఏళ్ళతరువాత భూలోకం లో  ఇంద్రద్యుమ్నుడు యొక్క కీర్తి ప్రతిష్టలు ఎలా ఉన్నాయో దేవేంద్రుడు సర్వే చేయించాడు.  చాలామంది ఇతడిని మర్చిపోయారు.  దాంతో పుణ్యం కరిగిపోయి ఇతడిని భూలోకం లో విడిచి రమ్మని కొందరు దేవదూతలు ఇచ్చి పంపించాడు దేవేంద్రుడు.  "లేదు లేదు.. నా గూర్చి ఇంకా తెలిసిన వారు ఉన్నారు.  నన్ను ఇక్కడే ఉండనివ్వండి" అని ప్రార్ధించాడు  ఇంద్రద్యుమ్నుడు.  అలా అయితే ఆ విషయం నిరూపించుకుని రా.. అని ఆదేశించాడు దేవేంద్రుడు.  

  ఇంద్రద్యుమ్నుడు తో పాటు మరో ఇద్దరు దేవదూతలు భూలోకం వచ్చారు.  అప్పటికి వెయ్యి సంవత్సరాలుగా జీవిస్తున్న మార్కండేయ ముని దగ్గరకు వెళ్లి "నేను మీకు తెలుసా?" అని అడిగాడు  ఇంద్రద్యుమ్నుడు.  "తెలియదు...నాకంటే రెండువేల ఏళ్ళు పెద్దది అయిన ప్రావాకర్ణము అనే గుడ్లగూబ ఉన్నది.  అక్కడికి వెళ్లి అడుగు"  సలహా ఇచ్చాడు మార్కండేయుడు.  

 గుడ్లగూబ దగ్గరకి వెళ్లారు ముగ్గురూ.  "నీ పేరు నాకు తెలియదు.  నాకంటే నాలుగువేల ఏళ్ళు పెద్దది అయిన నాడీజంఘుడు అనే బకశ్రేష్ఠుడు ఉన్నాడు.  అక్కడికి వెళ్లి అడగండి"  చెప్పింది గుడ్లగూబ. 

  కొంగ దగ్గరికి వెళ్లారు.  "నువ్వు ఎప్పుడు పాలించావో నాకు తెలియదు.  నాకంటే అయిదు వేలయేళ్ళ పెద్దది అయిన ఆకూపారుడు అనే తాబేలు ఉన్నది.  దానిని అడగండి"  చెప్పింది కొంగ.  

  గుండెలు చిక్కబట్టుకుని గబగబా తాబేలు దగ్గరకి వెళ్లారు.  "ఓహ్... నువ్వు  ఇంద్రద్యుమ్నుడు అనే రాజువు కదా... పదివేల ఏళ్ళక్రితం నీవు ఈ భూమిని పాలించావు.  నువ్వు మునులకు ఇచ్చిన దానంగా ఇచ్చిన లక్ష గోవులు ఈ ప్రాంతాన్ని తమ గిట్టలతో తొక్కుకుంటూ పోవడం వలన గుంతలు ఏర్పడి అవి చెరువుగా మారాయి.   నీరు పుష్కలంగా ఉన్నది.  అందువల్ల నేను ఇంకా నిన్ను తలచుకుంటూ ఇక్కడ హాయిగా కుటుంబంతో గడుపుతున్నా"  అని చెప్పింది తాబేలు సంతోషం తో.

  అప్పుడు దేవదూతలు సంతోషించి "రాజా.. నీ కీర్తి భూలోకం లో ఇంకా ఉన్నది.  కనుక నీవు స్వర్గలోక నివాసానికి అర్హుడివి"  అని పల్లకీ లో  ఇంద్రద్యుమ్నుడు ను స్వర్గలోకం తీసుకెళ్లారు.  

          *****  

 దీనిలో నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి?  

వందలమంది నాయకులు ఉన్నా  అధికారం ఏ ఒక్కరికో దక్కుతుంది.  ఆ అధికారం ఉన్న సమయం లో తాత్కాలికంగా ప్రజల కన్నీరు తుడిచే పధకాలు కాకుండా,  శాశ్వతంగా జనానికి మేలు చేసే పధకాలను అమలు చేస్తే ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతారు.  వారి పాలన ముగిసి దశాబ్దాలు గడిచినా, ప్రజలు వారిని మర్చిపోలేరు.  మనదగ్గర అలాంటి మహానాయకులు కొందరు ఉన్నారు.  పేర్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు.  అధికారం శాశ్వతం కాదు.  కీర్తిప్రతిష్టలు శాశ్వతం.  చరిత్రలో ఎందరో రాజులు ధరాతలాన్ని ఏలారు.   శ్రీకృష్ణ దేవరాయలు మనకు గుర్తున్నాడు.  చంద్రగుప్తుడు, శ్రీహర్షుడు లాంటి కొద్దిమంది చరిత్రకు ఎక్కారు.  ఎందరో ముఖ్యమంత్రులు గతించారు.  ఎన్టీఆర్, వైఎస్సార్ లు మాత్రమే ప్రజానాయకులుగా ముద్ర వేయబడ్డారు.   అధికారం ఉన్నది కదా అని ప్రజలను పీడించేవాడు, అవినీతితో ప్రజలసొమ్మును దోచుకునే వాడు, అధికారం కోల్పోగానే చిల్లిగవ్వకు కొఱగాడు. 

  అధికారం లో ఉన్నవారు  ఇంద్రద్యుమ్నుడిని  ఆదర్శంగా తీసుకొని చెరగని కీర్తిప్రతిష్టలు ఆర్జించాలి అని మనకు ఈ కథ బోధిస్తున్నది.

కామెంట్‌లు లేవు: