ss

ss
my

10, మే 2020, ఆదివారం

మునసబు గారి తీర్పు

మునసబు గారి తీర్పు 

           @@ 

  ఒక పల్లెటూరిలో పుల్లయ్య అనే పెద్దమనిషి ఉన్నాడు.  తన భార్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడం తో గ్రామం లోనే ఉన్న నాటు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు.  వైద్యుడు నాడి పరీక్షించి "ఈమెకు సీరియస్ గా ఉన్నది.  పట్నం వెళ్ళండి"  అని సలహా ఇచ్చాడు.  "అబ్బో.. ఇప్పుడు అంతదూరం వెళ్ళలేను డాక్టరు గారు.. మీరే ఏదోఒక వైద్యం చెయ్యండి...ఆమెను బతికించినా, చంపినా మీదే భారం.  మీ ఫీజు వంద వరహాలు ఇచ్చుకుంటాను"  అన్నాడు పుల్లయ్య.  

  వందవరహాలు అనేసరికి వైద్యుడికి ఆశ కలిగింది.  వైద్యం చేసాడు.  కానీ ఆమె చనిపోయింది. శవాన్ని తీసుకెళ్తుండగా తన ఫీజు ఇమ్మని అడిగాడు వైద్యుడు.  "నేను ఇవ్వను.. ఏమి చేసుకుంటావో చేసుకో"  అని కోపంగా భార్య శవాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు పుల్లయ్య.  

  వైద్యుడు వెళ్లి మునసబు గారికి ఫిర్యాదు చేసాడు.  పుల్లయ్యను కోర్టుకు రమ్మని మనిషిని పంపించాడు మునసబు.  హుటాహుటిన హాజరు అయ్యాడు పుల్లయ్య.  

  "నువ్వు ఏమి చెప్పావు వైద్యుడి తో?"  అడిగాడు మునసబు.  

 "నా భార్యను బతికించినా, చంపినా వంద వరహాలు ఇస్తాను అని చెప్పాను మునసబు గారు"  చెప్పాడు పుల్లయ్య.  

  "ఏమయ్యా? నిజమేనా?"  వైద్యుడిని అడిగాడు మునసబు.  

  "నిజమేనండి"  చెప్పాడు వైద్యుడు.  

 "మరి ఆమెను బతికించావా?"  అడిగాడు మునసబు.  

  "లేదండి"  బదులిచ్చాడు వైద్యుడు.  

 "పోనీ.. చంపావా?"  

 "అయ్యబాబోయ్.. నేనెందుకు చంపుతాను?  లేదండి"  భయంగా బదులిచ్చాడు వైద్యుడు.  

 "మరింకేమి?  పుల్లయ్య అడిగినట్లు నువ్వు ఆమెను బతికించనూ లేదు.  చంపనూ లేదు.. మరి ఫీజు దేనికి ఇవ్వాలి?  కేసు కొట్టేస్తున్నాను..కోర్టు వారి సమయం వృధా చేసినందుకు నీకు పది వరహాలు జరిమానా వేస్తున్నాను"  తీర్పు చెప్పాడు మునసబు.  

  లాజిక్కులు లాగడం లో, తీర్పులు చెప్పడం లో కోర్టులు ఈనాడూ, ఆనాడూ ఒకటే రకంగా ఉన్నాయి!!!

కామెంట్‌లు లేవు: