ss

ss
my

10, మే 2020, ఆదివారం

కచుడు

కచుడు 

@@@

నేను హైస్కూల్ లో చదివే రోజుల్లో కచదేవయాని అనే పాఠ్యఅంశం ఉండేది.  భారతం లో ఒక కథ ఇది.  

 దేవతలు, రాక్షసులు ఒక తండ్రి బిడ్డలే.  తల్లులు వేరు.  వీరిద్దరికి ఏనాడూ సఖ్యత లేదు. ఎప్పుడూ యుద్ధాలు చేసుకునేవారు.  రాక్షసుల గురువు శుక్రాచార్యుడు.  దేవతల గురువు బృహస్పతి.  శుక్రాచార్యుడు మహా పండితుడు. సకల శాస్త్ర పారంగతుడు.  ఈయనకు దేవయాని అనే కుమార్తె ఉన్నది.  ఆమె మహా అందగత్తె.  దేవరాక్షస యుద్దాలు జరిగినపుడు రాక్షసులదే పైచేయిగా ఉండేది.  దేవతలు అనేకమంది చనిపోతుండే వారు.  శుక్రాచార్యుని దగ్గర 'మృత సంజీవని'  అనే విద్య ఉండేది.  అనగా చనిపోయిన వారిని తిరిగి బ్రతికించే విద్య అన్నమాట.  ఆ విద్యను ప్రయోగించి చనిపోయిన రాక్షసులను శుక్రాచార్యుడు బ్రతికిస్తూ ఉండేవాడు.  దేవతల దగ్గర ఆ విద్య లేదు.  దాంతో దేవతల జనాభా క్రమక్రమంగా తగ్గిపోతున్నది.  

  దీంతో ఆందోళన చెందిన ఇంద్రుడు బృహస్పతి కుమారుడు అయిన కచుడు ను శుక్రాచార్యుడి దగ్గర విద్యనేర్చుకునే నెపం తో వెళ్లి మృతసంజీవనీ విద్యను నేర్చుకుని రమ్మని కోరుతాడు.  అప్పుడు కచుడు పాతాళ లోకం వెళ్లి శుక్రాచార్యుని శిష్యునిగా చేరుతాడు.  రాక్షస పిల్లలకు కచుడ్ని చూస్తే అసూయగా ఉండేది.  అతను బృహస్పతి కుమారుడు కావడం తో బుద్ధి కుశలత ఎక్కువగా ఉండి పాఠాలు త్వరగా నేర్చుకునే వాడు.  అతని అందాన్ని చూసి దేవయాని అతడిని ప్రేమించింది.   ఎన్ని విద్యలు నేర్పినా, మృతసంజీవనీ విద్య మాత్రం కచుడికి నేర్పడం లేదు శుక్రుడు. 

  కచుడి మీద ఈర్ష్యతో రాక్షస  విద్యార్థులు ఒకరోజు అడవిలో కచుడ్ని హత్య చేస్తారు.  కచుడు ఎంతకూ రాకపోవడం తో దేవయాని ఏడుస్తుంది.  అప్పుడు శుక్రుడు దూరదృష్టి తో జరిగింది గ్రహించి మృతసంజీవనీ విద్యతో అతనిని బ్రతికిస్తాడు.  దీంతో రాక్షస విద్యార్థులు కుతకుత ఉడికిపోయి ఒకరోజు సాయంత్రం కచుడ్ని చంపి కాల్చి బూడిద చేసి మద్యం లో కలిపి శుక్రుడి తో తాగిస్తారు.  శుక్రుడు మద్యపాన ప్రియుడు.  

  రెండు రోజులతరువాత కూడా కచుడు ఇంటికి రాకపోవడం తో మళ్ళీ దేవయాని తండ్రి ముందు రోదిస్తుంది.  అప్పుడు శుక్రుడు దూరదృష్టి తో జరిగిన విషయం గ్రహించి కచుడు తన పొట్టలోని ఉన్నట్లు తెలుసుకుంటాడు.  ఇప్పుడు కచుడ్ని మృతసంజీవనీ తో బ్రతికించినప్పటికీ, అతను వెలుపలికి ఎలా వస్తాడు? తన పొట్ట చీల్చుకుని బయటకి రావాలి.  అప్పుడు తాను మరణిస్తాడు.  ఇక గత్యంతరం లేక శుక్రుడు మృతసంజీవనీ విద్యను కచుడికి ఉపదేశించి బయటకు వచ్చిన తరువాత తనను బ్రతికించమని కోరుతాడు.  

  ఆ విధంగా విద్యనేర్చుకున్న కచుడు బ్రతికి, శుక్రుడి ఉదరాన్నిచీల్చుకుని బయటకు వస్తాడు. వెంటనే సంజీవని విద్యతో గురువును బ్రతికిస్తాడు. తన సురాపానం వ్యసనం వల్లనే తనకు మాత్రమే తెలిసిన విద్యను కచుడికి ధారపోయాల్సి రావడం తో శుక్రుడు ఖేదపడి "ఇకనుంచి సురాపానం అనేది మహాపాతకం అవుతుంది"  అని శపిస్తాడు.  

 వచ్చినపని అయిపోవడం తో శుక్రాచార్యుడి వద్ద సెలవు తీసుకుని దేవలోకానికి ప్రయాణం అవుతాడు.  దేవయాని అతని వెంటపడి తనను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపొమ్మంటుంది.  "నువ్వు గురుపుత్రికవి. కనుక నాకు సోదరి సమానురాలివి."  అంటాడు.  దాంతో దేవయాని ఆగ్రహం తో "ఇప్పుడు అర్ధం అయింది.  నువ్వు మృతసంజీవనీ కోసమే శిష్యుడిలా నటించావు.  ఆ విద్య రాగానే జారుకుంటున్నావు.  నువ్వు నేర్చుకున్న విద్య నీకు పనికిరాదు"  అని శాపం ఇస్తుంది.  కచుడు కూడా కోపం తో "నువ్వు అధర్మంగా ప్రవర్తించావు.  కనుక నీకు బ్రాహ్మణుడి తో వివాహం జరుగదు"  అని ప్రతిశాపం ఇచ్చి స్వర్గానికి వెళ్ళిపోతాడు.  

  ********* 

ఈ కథ ద్వారా ఏమి నేర్చుకోవాలి?  

 సారాయి తాగిన వాడికి ఉచ్ఛం నీచం తెలియదు.  భార్యకు, కూతురుకు తేడా తెలియదు.  తాగి వాహనాలు నడిపేవాళ్లు తాము ప్రమాదంలో పడటంతో పాటు దారినపోయేవారిని కూడా ప్రమాదానికి గురిచేస్తుంటారు.    మద్యపాన వ్యసనం తో ఇల్లూ వళ్లు గుల్లచేసుకుంటారు.  ఆస్తులు అమ్ముకుంటారు.  కనుక తాగుడుకు దూరంగా ఉంటె ఆరోగ్యానికి, సమాజానికి కూడా మంచిది.  

 ఇక కచుడి కోణం లోంచి చూస్తే... నేటి రాజకీయాలలో వినిపిస్తున్న 'కోవర్ట్' అనే పదానికి ప్రతీక కచుడు.  అతను దేవతల కోవర్ట్ గా శుక్రుడి దగ్గరకు చేరాడు.  ఆయన మీద అభిమానం తో కాదు.  వచ్చిన పని అయిపోగానే గురువుకు పంగనామం పెట్టేసి వెళ్ళిపోయాడు.  నిన్నటిదాకా మనలను బండబూతులు తిట్టినవాడు ఇవాళ మనపార్టీలో చేరుతున్నాడు అంటే వాడు శత్రుపక్షం కోవర్ట్ ఏమో అని సందేహించాలి.  అలాంటి సందేహాలు రాకపోవడం తో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు కాంగ్రెస్, తెలుగుదేశం ల నుంచి అనేకమంది కోవర్ట్ లు చేరి చిరంజీవి కొంప ముంచారు. అలాంటి కోవర్టు లలో పరకాల ప్రభాకర్ అగ్రేసరుడు అని ఆ రోజుల్లో చెప్పుకున్నారు.  ఒక వ్యక్తిని నమ్మి చేరదీసే   ముందు అతని చరిత్రను కూలంకుషంగా పరిశీలించాలి.  వాడు పెద్ద నాయకుడే కావచ్చు.  వచ్చాడు కదా అని చంకలు గుద్దుకోరాదు.  వాడిని నమ్మి ఎప్పటినుంచో తమదగ్గర నమ్మకంగా ఉంటున్నవారికి ద్రోహం చెయ్యకూడదు.  

 శుక్రుడు, కచుడు పాత్రలను పరిశీలిస్తే మనకు అర్ధం అయ్యే నీతి ఇదే.

కామెంట్‌లు లేవు: