ss

ss
my

10, మే 2020, ఆదివారం

జీమూతవాహనుడు

జీమూతవాహనుడు 

  ఈ కథ నేను చదువుకునే రోజుల్లో ఒక పాఠం గా ఉండేది.  ఇది గుణాఢ్యుడు రచించిన బృహత్కథలు గ్రంధం లోనిది అని గుర్తు.  సరిగ్గా జ్ఞాపకం రావడం లేదు.  

 జీమూతవాహనుడు విద్యాధర తెగకు చెందిన జీమూతకేతుడు అనే రాజు కుమారుడు.  చాలా దయార్ద్ర హృదయుడు.  యుక్తవయసు వచ్చాక ఇతనికి పట్టాభిషేకం చేసి తల్లితండ్రులు అడవికి వెళ్లి తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతారు.  అయితే, తల్లితండ్రుల పట్ల విపరీతమైన భక్తిభావం కలిగిన జీమూతవాహనుడు తానూ కూడా తల్లితండ్రుల దగ్గరకు వెళ్లి వారికి సపర్యలు చేస్తుంటాడు.  

 ఒకనాడు ఇతను అడవిలో తిరుగుతుండగా అక్కడకు మలయవతి అనే అందమైన అమ్మాయి తన సఖులతో విహరిస్తూ చూసింది.  అతని అందానికి ముగ్ధురాలై అతని వివరాలు కనుక్కోమని చెలికత్తె తో చెప్పింది.  అతను విద్యాధర చక్రవర్తి జీమూతవాహనుడు అని చెలికత్తె చెప్పింది.  అంతలో జీమూతవాహనుడు కూడా ఆమెను చూసాడు.  ఇద్దరి చూపులు కలిసాయి.  

  పెద్దలు అంగీకరించి ఇద్దరికీ వివాహం చేశారు. పెళ్లి అయిన మరునాడు జీమూతవాహనుడు తన బావమరిది తో కలిసి దూరాన ఉన్న కొండ ప్రాంతానికి వెళ్ళాడు.  అక్కడ గుట్టలు గుట్టలుగా ఎముకల పోగులు కనిపిస్తాయి.  బావమరిదిని అడిగాడు.  గరుత్మంతుడు సర్పాలను ఇష్టం వచ్చినట్లు భక్షిస్తుండగా, సర్పజాతి అంతరించి పోతుందని భీతిల్లిన సర్ప రాజు గరుత్మంతుని తో ఒక ఒప్పందం చేసుకుకున్నాడు.  అదేమిటంటే ప్రతిరోజూ ఒక పామును అతనికి ఆహారంగా పంపుతామని.  దాన్ని భుజించి తృప్తి పడమని కోరతాడు.  గరుత్మంతుడు అంగీకరిస్తాడు.  ఆ విధంగా యుగాల తరబడి రోజుకో పామును వధిస్తుండగా ఏర్పడిన ఎముకల గుట్ట అని బావమరిది చెప్తాడు.  

  ఆ రోజు శంఖచూడుడు అనే సర్పం వంతు వచ్చింది.  అతడికి ఎర్రని వస్త్రం కప్పి అతని తల్లి రోదిస్తూ గుట్ట మీదకు తీసుకొస్తుంది.  ఆ దృశ్యం చూడగానే జీమూతవాహనుడి హృదయం కరిగిపోయింది.  ఆమెకు శంఖచూడుడు ఒక్కడే కుమారుడు అని తెలుసుకుని, అతనికి బదులుగా తాను ఆహరం అవుతానని,  ఆ ఎర్ర వస్త్రం తనకు ఇమ్మని కోరుతాడు  జీమూతవాహనుడు.  అయితే అందుకు శంఖచూడుడు అంగీకరించలేదు.  ఇలా కొంతసేపు వాదన జరుగుతుంది.  

ఇంతలో జీమూతవాహనుడికి వారి అత్తగారి ఆచారం ప్రకారం ఎర్ర వస్త్రాలు కట్టుకోవాలని బట్టలు తెస్తారు సేవకులు.  ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా, ఆ వస్త్రాలను ధరించి వధ్యశిల మీద పడుకుంటాడు జీమూతవాహనుడు.  ఇంతలో గరుడుడు వచ్చి అక్కడ పడుకున్నది సర్పమే అని భావించి జీమూతవాహనుడి మాంసం ఖండాలను చీల్చి భుజిస్తుంటాడు.  బాధను ఓర్చుకుంటూ నోరు మెదపడు జీమూతుడు.  ఈ విషయం తెలిసిన జీమూతుడి అత్తమామలు పరుగు పరుగున వచ్చి గరుడుడు తిన్నది తమ అల్లుడిని అని, అతడిని తిరిగి బ్రతికించమని ప్రార్ధిస్తారు.  అప్పటికే జీమూతుడు మరణిస్తాడు.  

  గరుడుడు తాను చేసిన తప్పును గ్రహించి క్షమాపణ చెప్తాడు.  కానీ అమృతం తెచ్చి అయినా తమ అల్లుడిని బ్రతికించమని వేడుకుంటారు అత్తమామలు.  అప్పుడు గరుడుడు ఇంద్రలోకం వెళ్లి అమృతాన్ని తెచ్చి జీమూతవాహనుడి మీద చల్లి బ్రతికిస్తాడు.  తనతో పాటు సర్పాలను కూడా బ్రతికించమని జీమూతుడు కోరుతాడు.  గరుడుడు ఒప్పుకుని సర్పాల ఎముకల గుట్ట మీద అమృతాన్ని కురిపిస్తాడు.  చనిపోయిన సర్పాలు అన్నీ బ్రతుకుతాయి.  

  *** 

 పై కథ నుంచి ఏమి నేర్చుకోవాలి?  

సాటిమనుషుల మీద ప్రేమ, త్యాగబుద్ధి మనుషుల ఔన్నత్యాన్ని ఇనుమడింప చేస్తాయి.  తనను నమ్మిన వారి కోసం ప్రాణాలైనా అడ్డుపెట్టే మహా త్యాగమూర్తులు ఒకప్పుడు ఉండేవారు.  ఇప్పుడు అలాంటివారు కనిపించకపోవచ్చు.  ఉచిత అన్నదాన సత్రాలు నిర్వహిస్తూ పేదల కడుపులు నింపేవారు,  పేదలకు ఉచితంగా వైద్యం చేసేవారు,  పేదలకు విద్యాదానం చేసేవారు, ఆపదలో అవసరం అయినవారికి రక్తదానం  చేసేవారు,  నిస్వార్థంగా అనాధాశ్రమాలు నిర్వహించేవారు,  ఎవరైనా ప్రమాదానికి గురి అయితే,  నిర్లక్ష్యం చెయ్యకుండా ఆంబులెన్స్ ని పిలిపించి సమీప ఆసుపత్రిలో చేర్చి ప్రాణాలు కాపాడేవారు, జీమూతవాహనులే.  

 పిల్లలకు కోపం, క్రోధం, ఆవేశం లాంటి దుర్లక్షణాలు ఉంటె,  వారికీ ఇలాంటి కథలు చెప్పి వారికీ శాంతం, ప్రేమ, త్యాగం లాంటి లక్షణాలను పెంపొందిస్తే, జీమూతవాహనుడు చనిపోయిన సర్పాలను బ్రతికించిన విధం గానే, ఆ పిల్లలు పెద్దలై తమ ఉత్తమ గుణాలతో దేశానికి ఎంతో మేలు చెయ్యగలరు.

కామెంట్‌లు లేవు: