ss

ss
my

10, మే 2020, ఆదివారం

ఇనుపభీముడు

ఇనుపభీముడు 

@@@

 నిజానికి ఇది ఒక పాత్ర పేరు కాదు.  శ్రీకృష్ణుడి మాయాజాలం.  భారతం లోని ఒక కథ.  

  కురుపాండవ యుద్ధానంతరం కౌరవ సోదరులను హతమార్చి విజయులైన పాండు కుమారులు తమ పెదనాన్న అయిన ధృతరాష్ట్రుడిని చూడటానికి వెళ్తారు.  పాండవుల చేతులో నిహతులైన తన సంతానాన్ని తలచుకుంటూ కుమిలిపోతున్న ధృతరాష్ట్రుడు పాండవుల రాకను విని తన దర్శనానికి పిలుస్తాడు.  యుద్ధం లో విజయులు అయిన పాండుకుమారులను ఒక్కొక్కరిని కౌగిలించుకుంటూ ఆశీర్వదిస్తూ చివరకు భీమసేనుని దగ్గరకు వెళ్తాడు.  

  అంధుడు అయినప్పటికీ ధృతరాష్ట్రుని శారీరిక బలాన్ని ఎరిగిన శ్రీకృష్ణుడు భీమసేనుని పక్కకు లాగి, అక్కడ ఒక భీముడి శరీరానికి సరిపోయే ఒక ఇనుప విగ్రహాన్ని ఉంచి "ఇతడే భీమసేనుడు.  ఆశీర్వదించు"  అని ధృతరాష్ట్రునితో చెప్తాడు.  ధృతరాష్ట్రుడు భీమసేనుని విగ్రహాన్ని నవ్వుతో కౌగిట్లో పెట్టుకుని బలంగా వత్తుతాడు.  దృతరాష్ట్రుడి బలాధిక్యతకు ఇనుప విగ్రహం ముక్కలు ముక్కలు అయిపోతుంది.  తన కొడుకుని చంపిన భీముని నిర్జించాను అని సంతోషం చెందుతూ, పైకి దుఖ్ఖము నటిస్తూ "అయ్యో.. భీమసేనా... నువ్వు మరణించావా? " అని అంటాడు.  

  ఆ దృశ్యం చూసి పాండవులు నిశ్చేష్టులు   అవుతారు.  ధృతరాష్ట్రునికి అంత బలం ఉన్నట్లు వారికి తెలియదు.  

 శ్రీకృష్ణుడు నవ్వుతూ "మామా...వయసు పైబడినా నీలో మత్సరం చావలేదు.  నీ బలం నాకు తెలుసు.  నువ్వు ఏమి చెయ్యబోతావో నాకు తెలుసు.  అందుకే భీముని పక్కకు పంపి అక్కడ ఇనుపభీముడిని ఉంచాను.  కొడుకులను పోగొట్టుకున్నా, రాజ్యం సర్వనాశనం  అయినా నీ దుష్టబుద్ధి మాత్రం చావలేదు. భీముడు ఇక్కడే ఉన్నాడు"  అని అంటాడు.  

                    @@  

దీనిలో తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి? 

 మనిషిలో కోపం, ద్వేషం, అసూయ, మత్సరం అనే దుర్గుణాలు మహా శక్తివంతమైనవి.  మరణం సమీపిస్తున్నా ఆ దుర్గుణాలు మనిషిని మరింత పతన దిశగా నడిపిస్తాయి.  మనిషిలోని మానవత్వాన్ని దహించివేస్తాయి.  ఉచ్ఛం నీచం తెలియవు. విచక్షణ కోల్పోతాడు.  సాధారణంగా మనం పత్రికలలో చదువుతుంటాము...  వాడెవడో భార్యను పదిహేను సార్లు గొంతుకోసి హత్య చేశాడు.....అలాగే ఇంకెవడో ఒక స్నేహితుడిని 30  సార్లు కత్తితో పొడిచి చంపేశాడు.  నిజానికి ఒకసారి గొంతుకోసినా,   ఒకసారి కత్తి పోటు పొడిచినా ప్రాణం పోతుంది.  కానీ మిగిలిన ఆ పదునాలుగు గొంతు కోతలు, 29  కత్తి పోట్లు అవతలివాడి లోని కసికి, పగకు, ద్వేషానికి నిదర్శనాలు.  అందుకే మనిషి తనలోని కోపాన్ని, ద్వేషాన్ని నిగ్రహించుకోవాలి.  లేకపోతె ధృతరాష్ట్రుని మాదిరిగా చివరిదశలో కూడా పరాభవం పాలు అవుతారు.  పరువు పోగొట్టుకుంటారు.  

  మరొకటి... ధృతరాష్ట్ర కౌగిలి అనే మాట ను చాలామంది వినే ఉంటారు.  పరిష్కరించడానికి వీలు లేని సమస్యలలో చిక్కుకున్న వాడిని, ఇతరులను గుడ్డిగా నమ్మి మోసపోయిన వారిని ఉద్దేశించి వాడు "ధృతరాష్ట్ర కౌగిలి లో చిక్కుకున్నాడు"  అని అంటారు. ఆ కౌగిట్లో చిక్కుకుంటే చావు తప్పదు అని అర్ధం.  

సరదాగా -----  తన కళ్ళముందే తనకు గోతులు తవ్వుతున్నా ఏమాత్రం గ్రహించలేక ఎన్టీఆర్ తన పదవిని పోగొట్టుకున్నారు.  ముఖ్యమంత్రిగా గద్దె ఎక్కి తనను చూడటానికి అల్లుడు చంద్రబాబు తన ఇంటికి వచ్చారు.  ఆ క్షణం లో ఎన్టీఆర్.. దృతరాష్ట్రుడి మాదిరిగా అల్లుడిని కౌగలించుకుని నలిపి పిండి పిండి చేస్తారేమో అనే చిలిపి ఊహ అప్పట్లో నాకు వచ్చింది.  కానీ ఎన్టీఆర్ అసలు అల్లుడిని ఇంట్లోకే రానివ్వలేదు.

కామెంట్‌లు లేవు: