ss

ss
my

30, మే 2020, శనివారం

ఉపమన్యువు

ఉపమన్యువు 

       @@@

ఇది శివపురాణంలో ఒక ఘట్టం.  

ఉపమన్యువు ఒక బ్రాహ్మణ బాలుడు.   విధివశాత్తూ బంధువుల నిరాదరణకు గురైన ఇతని తల్లి ఇతడు పసిబాలునిగా ఉన్నప్పుడే ఒక అడవిని చేరుకొని అక్కడ చిన్న గుడిసెను నిర్మించుకుని జీవిస్తున్నది.  పసివాడు కావడంతో ఆకలితో ఏడ్చినప్పుడు అతనికి ఆహారం పెట్టలేక నీటిలో కొంచెం వరిపిండిని కలిపి పాల మాదిరిగా తయారుచేసి ఇచ్చేది తల్లి.  అయితే అవి రుచించక నాకు పాలు కావాలి అని మారాము చేస్తాడు ఉపమన్యువు.  "ఈ అడవిలో నేను పాలను ఎక్కడినుంచి తీసుకురాగలను?" విచారంగా చెప్పింది తల్లి.  

అపుడు ఉపమన్యువు "నేను పరమేశ్వరునికోసం తపస్సు చేసి పాలను సాధిస్తాను"  అని తపస్సుకు కూర్చుంటాడు.   చూస్తుండగా అది ఘోరతపస్సుగా మారుతుంది.   కైలాసంలో అగ్నిశిఖలు ఉద్భవిస్తాయి.   ఆ వేడికి మంచుకొండలు కరిగిపోతున్నాయి.   అపుడు పరమేశ్వరుడు దయతలచి ముందుగా ఈ బాలుడి చిత్తశుద్ధిని పరీక్షించాలనే అభిమతంతో ఇంద్రుని రూపంలో ప్రత్యక్షం అవుతాడు.  "ఏమి వరం కావాలో కోరుకో బాలకా" అంటాడు.  "నేను శివుని కోసం తపస్సు చేస్తున్నాను.   "నువ్వు అక్కర్లేదు వెళ్ళు" అని చెప్పి మళ్ళీ తపంలో మునిగిపోతాడు ఉపమన్యువు.  శివుడు నవ్వుతూ "నీకు వరం ఇవ్వడానికి ఎవరైతే ఏమి?  నీకు కావలసింది ఇస్తాను. కోరుకో. శివుణ్ణి మెప్పించడం చాలా కష్టం"  అంటాడు.  

 ఉపమన్యువు సమ్మతించక "నేను చేసే తపస్సు  మహాశివునికోసం మాత్రమే.  ఎంతకాలమైనా తపస్సు చేస్తాను.  నువ్వు వెళ్ళిపో" అని కమండలం నుంచి మంత్రజలాన్ని తీసుకుని చల్లుతాడు.  ఆ జలం దేహంపై పడగానే ఇంద్రుడి రూపం తొలిగిపోతుంది.  శివుడు నిజరూపంలో ప్రత్యక్షమై ఉపమన్యువు కోరుకొగానే పాలు పెరుగు సమృద్ధిగా లభించాలని వరం ప్రసాదించి అదృశ్యమై పోయాడు.  

***

పై కథనుంచి మనం తీసుకోవలసిన నీతి ఏమిటి?  

దేనికైనా పట్టుదల, కృషి, శ్రమ అవసరం.  ఏదైనా శ్రమించి సాధించాలి.  కష్టే ఫలి అన్నారు పెద్దలు.  మనలో కోరికలు ఉండవచ్చు.  కానీ, అవి మనముందుకు వచ్చి వాలిపోవు.  వాటిని సాధించడానికి మనవంతు ప్రయత్నం మనం చెయ్యాలి.  గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే దీపం వెలగదు.  ఇక్కడ శివుడిని ఒక దేవుడిగా చూడరాదు.  మన శ్రమ, కృషి లో చిత్తశుద్ధి ఉంటే దయగల ధర్మాత్ములు ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తారు.  

ఏదీ తనంత తానై నీ దరికి రాదు 
శోధించి సాధించాలి 
అదియే ధీరగుణం 

అంటారు మహాకవి శ్రీశ్రీ

కామెంట్‌లు లేవు: