ss

ss
my

29, డిసెంబర్ 2009, మంగళవారం

పిసినారి దంపతులు

ఒక అగ్రహారం లో రాజయ్య, సీతమ్మ అనే దంపతులు వుండేవారు. ఒకరికి పెట్టే మాట ఎలా వున్నా ...తమ కడుపులకు కూడా తృప్తిగా తినే వారు కాదు. తింటే ఖర్చు అయి పోతుంది అనేది వారి ఆలోచన. తేరగా వస్తుంది అంటే ఆమడ దూరమైనా వెళ్ళే వారు. తమకి ఖర్చు అనుకొంటే మూల ఇంటి లోంచి బయటకు రారు.

ఒక రోజు పొరుగూరు నుండి రంగయ్య అనే చుట్టం పని మీద వాళ్ళింటికి వచ్చాడు. వచ్చిన వాడు పనిచూసుకుని వెళ్లి పోకుండా రాజయ్యతో కబుర్లాడుతూ కూర్చున్నాడు. ఎంత సేపటికి కదలకుండా మాటలు కొనసాగించడం తనకి ఇష్టం లేక పోయినా ...పొమ్మన లేక తలూపుతూ వుండి పోయాడు రాజయ్య.

మధ్యాహ్నమైంది.

తనకి ఆకలి అవుతుంది. వచ్చిన చుట్టం వెళ్లి పోయాక తినాలనేది రాజయ్య ఆలోచన. ఇంత సేపు వున్నానుగదా... వేళకి నాలుగు మెతుకులు తిని వెళదామని రంగయ్య ఆలోచన.

చివరికి విధిలేక మాటవరసకి " రంగయ్య గారూ...! భోజనానికి లేవండి.. ! " అన్నాడు రాజయ్య.

" ఇప్పుడు భోజనం ఎందుకులే రాజయ్య గారూ.. వూరికి వేళతానులే ...! " కాస్త మొహమాటంగా వుంటుందని చెప్పాడు రంగయ్య.

వెళ్లి పోతానన్న చుట్టాన్ని కాసింత బ్రతిమాలి వదిలేద్దామనిపించింది రాజయ్యకు.

" పర్లేదులే.. ..! రెండు మెతుకులు తిని వెళ్ళండి... " అన్నాడు పైకి గంభీరంగా రాజయ్య.

" సరే.. రాజయ్య గారూ... ! మరీ మొహమాట పెడుతున్నారు. .." అని ,... లేచి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకు రావటానికి బావి వైపు నడిచాడు రంగయ్య.

గతుక్కు మన్నాడు రాజయ్య. ...! పోయే పీడా తగిలించు కున్నానే అనుకుంటూ ....గబగబా భార్య దగ్గరకు పరుగెత్తి విషయం చెప్పి " సీతా ఇప్పుడెలా.. "అని అడిగాడు.

" అయ్యో..! నేను మన ఇద్దరికీ మాత్రమె వండాను. అది మీ ఇద్దరికీ పెట్టి నేను ఈ పూటకి పస్తు వుంటాను....! " చెప్పింది సీతమ్మ.

కొంచెం సేపు ఆలోచించిన రాజయ్య.... " నీవు పస్తు వుండక్కర లేదు. నేను చెప్పి నట్లు చేయి.." అని చెవిలో చల్లగా చెప్పాడు.

సీతమ్మ తల వూపి సరేనంది.

రాజయ్య, రంగయ్య భోజనానికి కూర్చున్నారు. సీతమ్మ అన్నం తెచ్చింది. భర్త కంచం లో ఒక గరిట వేసింది. మరో గరిట వేయబోయింది.

అంతలో రాజయ్య చేయి అడ్డు పెడుతూ..." చాలు..చాలు..! ఆపు.. ! మనిషి పుట్టుక పుట్టిన వాడు ఇంత కంటే ఎక్కువ తింటాడా ఎంటి.. ! " అన్నాడు.

పెట్టడం ఆపేసింది సీతమ్మ. చూసాడు రంగయ్య. రాజయ్య కంచం లో పిడికిడు మెతుకులే వున్నాయి.
తర్వాత రంగయ్యకు వడ్డించింది.

ఒక గరిట వేయగానే.. " చాలు...చాలు... " అన్నాడు రంగయ్య అంత కంటే ఎక్కువ తింటే తనని మనిషి క్రింద లెక్క వేయరని....!

కూర తెచ్చి ఒక గరిట వేసి రెండో గరిట వేయ బొగా.." ఆపు.. నేనెలా కనబడుతున్నాను... ! " అన్నాడు రాజయ్య.

అప్పటికే రంగయ్య పరిస్తితి అర్ధం చేసుకున్నాడు. తానూ ఒక గరిట కూర తోనే సరిపెట్టుకున్నాడు.

" రాజయ్య పిసినారి అని తెలుసు గాని ..... మరీ యింత పనికిమాలిన పిసినారి వెధవ అనుకోలేదు... ! బుద్ధి వుంటే జీవితం లో మరెప్పుడూ ఈ యింటి చాయలకు రాకూడదు.! " అని మనసులో అనుకున్నాడు రంగయ్య.

" రాజయ్య గారూ..! చాలా 'తృప్తిగా ' భోజనం పెట్టారు. జీవితం లో మీ ఆతిధ్యాన్ని మరిచిపోలేను.....! " అని వారి వద్ద సెలవు తీసుకుని బయలదేరాడు రంగయ్య.

భర్త తెలివి తేటలకి మురిసిపోయింది సీతమ్మ. ఎంతయినా భర్తకి తగ్గ భార్య కదా....!

మిగిలింది తృప్తిగా తిన్నారు దంపతులిద్దరూ...!

గణతంత్ర దినోత్సవం

రాజ్యాంగం వచ్చిన రోజు
రాజరికం పోయిన రోజు
దేశ ప్రజలందరి పండుగ రోజు
అదే..అదే.. మన గణతంత్రపు రోజు

ఆంతరంగిక.. బాహ్య విషయాలలో
ఏ విదేశీ శక్తికి లోబడని
స్వతంత్ర దేశంగా నిలిచింది
సర్వసత్తాక రాజ్య మైంది

ఆర్ధిక అంతరాలను తగ్గిస్తూ
దేశ పురోభివృద్దిని కోరుతూ
వెనుకబడిన వారికి అండగా నిలిచి
సామ్యవాద రాజ్య మైంది..

వివిధ మతాల నిలయం
మత ప్రమేయం లేని విధానం
తటస్త మత వైఖరి కలిగి
లౌకిక రాజ్య మైంది..

ప్రజల కొరకు వెలిసింది
ప్రజల చేత ఏర్పడింది
ప్రజలే పాలకులై పాలించే
ప్రజాస్వామ్య రాజ్య మైంది..

రాజరికపు వారసత్వాలకు
ముగింపు పలికింది
ఎన్నికలే పాలకులకు కొలబద్ధయి
గణతంత్ర రాజ్య మైంది..