ss

ss
my

27, మే 2020, బుధవారం

ఉత్తముడు

ఉత్తముడు 

                @@@

ఇది మార్కండేయపురాణంలో చెప్పబడిన విలువైన నీతి కథ.  

ఉత్తానపాదుడు-సురుచి అనే రాజ దంపతులకు జన్మించాడు. ధ్రువుడికి సవతి సోదరుడు.  యితడు పెద్దయ్యాక బహుళ అనే ఒక అందగత్తెను పెళ్లి చేసుకున్నాడు.  కానీ ఆమెకు ఇతనంటే చిన్న చూపు.  ఇతని మాటలను లక్ష్యపెట్టేది కాదు.  ఒకనాడు రాజబంధువులు పదిమంది కూర్చుని విందు ఆరగిస్తున్నపుడు ఉత్తముడు ఒక గ్లాసులో మధువును నింపి భార్యకు ఇవ్వబోగా ఆమె తిరస్కరించింది.  నలుగురిలో తనను అవమానించిందని ఆగ్రహించి భటులను పిలిచి ఆమెను అడవుల్లో వదిలేసి రమ్మని ఆజ్ఞాపించాడు.  ఇష్టం లేని భర్తతో కాపురం కన్నా, అడవుల్లో జీవితమే ఉత్తమని ఆమె కూడా ఆవేశంలో పతిని తూలనాడి భటులతో వెళ్ళిపోయింది.   అంతటి అందమైన, కోరి చేసుకున్న  భార్యను ఆవేశంలో  అడవులకు పంపినందుకు ఏమాత్రం సిగ్గుపడలేదు ఉత్తముడు.  

కొంతకాలం తరువాత ఉత్తముడి కొలువుకు సుశర్మ అనే వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి తన భార్యను ఎవరో అపహరించారని, ఆమెను తనకు తెచ్చి ఇవ్వమని ఫిర్యాదు చేశాడు.  ఆమె ఎలా ఉంటుందని అడిగాడు ఉత్తముడు.  నల్లగా, పొట్టిగా, వికారంగా, వృద్ధాప్యపు ఛాయలతో ఉంటుందని చెప్పాడు సుశర్మ.   ఉత్తముడు పెద్దగా నవ్వి "అలాంటి భార్య పోయిందని ఆనందించక  ఏడుస్తావెందుకు?  సంతోషించు?"  అన్నాడు హేళనగా.   పురుషుడు ఒకసారి ఒక కన్యను వివాహం చేసుకున్న తరువాత ఆమె కుంటిదైనా, గుడ్డిదైనా జీవితాంతమూ ప్రేమించాలని, యవ్వనంలో ఉన్నప్పుడు ఆమె మన కోరికలు అన్నీ తీర్చడమే కాక, పిల్లలను కని, పెంచి, పెద్దచేసి, మన వంశాన్ని నిలబెట్టిందనే సత్యాన్ని మరువకూడదని, భార్య భార్యేనని చెబుతాడు సుశర్మ.

ఆమెను వెతకడం కోసం ఉత్తముడే స్వయంగా అడవులకు వెళ్తాడు.  దారిలో దాహమై ఒక ముని ఆశ్రమానికి వెళ్లి తాను ఆ దేశానికి రాజును అని పరిచయం చేసుకుని కాసిని మంచినీళ్లు ఇమ్మని అడుగుతాడు.  ఒక శిష్యుడు గ్లాసుతో మంచినీరు తెచ్చి రాజు చేతికి ఇవ్వకుండా  దూరంగా నేలమీద పెడతాడు.  ఉత్తముడు ఆశ్చర్యపోయి తాను మహారాజును అని తెలిసీ కూడా అగౌరవంగా గ్లాసును  నేలమీద ఎందుకు ఉంచావు అని ప్రశ్నిచాడు.  భార్యావిహీనులు మునులనుంచి అర్ఘ్యపాద్యాదులు స్వీకరించడానికి అనర్హులు అని బదులిస్తాడు ముని.  

ఉత్తముడు బాధపడి తాను ఒక మహిళకు వెతుకుతున్నాను అని చెపుతాడు.  అపుడు ముని తన దివ్యదృష్టితో పరిశీలించి ఒక రాక్షసుడు ఆమెను తీసుకెళ్లి బంధించాడు అని ఆ వివరాలు చెబుతాడు.  దాని ప్రకారం ఉత్తముడు వెళ్లి రాక్షసుని కలిసి " బ్రాహ్మణ స్త్రీని ఎందుకు ఎత్తుకొచ్చావు?" అని ప్రశ్నించగా " సుశర్మ రాక్షసంహారం కోసం యాగం చేస్తున్నాడు.  భార్య లేనివాడు యాగానిర్వహణకు అనర్హుడు కాబట్టి ఆమెను ఎత్తుకొచ్చాను"  అని బదులిస్తాడు. భార్య యొక్క విలువ ఏమిటో గ్రహించిన   ఉత్తముడు పశ్చాత్తాపం చెంది  రాక్షసుని ఒప్పించి ఆమెను స్వాధీనం చేసుకుని తన భార్య ఎక్కడుందో చెప్పమని వేడుకుంటాడు.  రాక్షసుడు ఆమెను ఒక వనరాక్షసుడు అపహరించాడని చెప్పగా ఉత్తముడు సుశర్మ భార్యతో సహా ఆ ప్రాంతానికి వెళ్లి తన భార్యను తిరిగి తెచ్చుకుంటాడు.  

****

పై కథలోనుంచి నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి?  

సంసారం అంటే ఒక్క భర్త మాత్రమే కాదు.  భర్త సంపాదించి కుటుంబాన్ని పోషిస్తాడు అనేది నిజమే కావచ్చు (ఒకప్పటి మాట సుమా!)  కానీ, భార్య అనేది కూడా ఒక పదవి.  మహారాజు పదవి ఎలాంటిదో, మహారాణి పదవి కూడా అలాంటిదే.  రాజుకు ఉన్నట్లే మహారాణికి కూడా కొన్ని అధికారాలు ఉంటాయి. భార్య అంటే భర్త కింద అణిగిమణిగి పడి ఉండే దాసీ కాదని మన పురాణాలు ఏనాడో గుర్తించాయి.  అందుకే భార్యలేనివాడు పూజలకు, యాగాలకు అనర్హుడుగా ప్రకటించారు మన మహర్షులు.  ఎందుకంటే మగవాడు తన బుద్ధిని వక్రమార్గం పట్టించకుండా, భార్యను కాపాడుకోవాలని, ఆమె లేని జీవితం వ్యర్థమని పై గాధ మనకు బోధిస్తున్నది.

కామెంట్‌లు లేవు: