ss

ss
my

10, మే 2020, ఆదివారం

ఇల్వలుడు

ఇల్వలుడు 

@@@

  ఇది భారతం లోని ఒక కథ.  విప్రజిత్తి- సింహిక అనే రాక్షస దంపతులకు పుట్టిన కుమారులలో ఒకడు.  ఈ సింహిక అనే రాక్షసి హిరణ్యకశిపుని సోదరి.  ఇల్వలుడికి వాతాపి అనే ఒక సోదరుడు ఉన్నాడు.  ఇతడు కొందరు బ్రాహ్మణులను ఆశ్రయించి  తాను కోరిన కోరికలు వెంటనే ఫలించే మంత్రం ఒకదాన్ని ఉపదేశించమని కోరాడు.   అయితే అలాంటి మంత్రం ప్రమాదకరం అని బ్రాహ్మణులు అందుకు తిరస్కరించారు.  

దానితో ఇల్వలుడు బ్రాహ్మణుల మీద పగబట్టాడు.  బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానించేవాడు.  సోదరుడు వాతాపి కి కామరూప విద్య తెలుసు.  అనగా తాను కోరుకున్న రూపం పొందే శక్తి అతనికి ఉన్నది.  ఆ శక్తి వలన అతడు మేకగా మారేవాడు.  అప్పుడు ఆ మేకను వధించి మాంసం వండి బ్రాహ్మణులకు భోజనం లో వడ్డించేవాడు. వారు మొత్తం తిన్న తరువాత "వాతాపీ... వాతాపీ " అని పిలిచేవాడు.  వెంటనే బ్రాహ్మణుల పొట్టలో ఉన్న వాతాపి బ్రాహ్మణుల పొట్టలను చీల్చుకుని బయటకు వచ్చేవాడు.  ఆ రకంగా ఇరువురూ వేలాది బ్రాహ్మణులను చంపేశారు.  

  ఈ సంగతి తెలుసుకున్న కొందరు బ్రాహ్మణులు అగస్త్యముని ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అప్పుడు అగస్త్య ముని ఇల్వలుడు ఇంటికి భోజనానికి వెళ్ళాడు.  యధాప్రకారంగా వాతాపిని మేకగా మార్చి కోసి మాంసం వండి అగస్త్యుడికి వడ్డించాడు.  అగస్త్యుడు భుజించగానే పొట్ట మీద రాసుకుంటూ "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం"  అన్నాడు.  దాంతో పొట్టలోని వాతాపి జీర్ణమై పోయాడు. ఆరోజు నుంచి మనం తినరాని పదార్ధాలను తిన్నా, అమితంగా భుజించినా మన కుక్షిని నిమురుకుంటూ పై మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే అరిగిపోతుందని పెద్దలు చెబుతారు.  అలాగే పిల్లలకు ఆహారం తినిపించిన పిదప తల్లులు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తారు.    

  ఆ విషయం తెలియని ఇల్వలుడు మామూలుగానే "వాతాపి.. వాతాపి.." అని పలుమార్లు పిలిచాడు.  ఎక్కడి వాతాపి?  ఖంగు తిన్న ఇల్వలుడు ఏమీ తెలియనట్లే ఏడుపు ముఖం తో నవ్వుతూ అగస్త్యుడిని కొంత దక్షిణ ఇచ్చి పంపేశాడు.  

                        @@@  

ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏమిటి?  

 అవతల వారిని కొంతకాలం మోసం చెయ్యవచ్చు.  కానీ మోసం అనేది ఎల్లకాలం సాగదు. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నే వాడుంటాడు.  మనమే గొప్ప అని విర్రవీగకూడదు.  మనకు తెలియకుండా ఎందరో శక్తివంతులు ఉంటారు.  మనం చేసే మోసం ఎప్పుడో ఒకసారి మనకు ఎదురు తిరుగుతుంది.  అప్పుడు నీళ్లు నమలడం తప్ప మనం చేయగలిగేది ఏమీ ఉండదు అని గ్రహించాలి.

కామెంట్‌లు లేవు: