ss

ss
my

10, మే 2020, ఆదివారం

ఉద్దాలకుడు

ఉద్దాలకుడు 

@@@

 ఇది జైమినీ భారతం లోని ఒక కథ. 

ఇతడు ఒక బ్రాహ్మణ యువకుడు.  కఠిన బ్రహ్మచర్యం అవలంబించాడు.  అయితే పెద్దల బలవంతం  తో చండిక అనే యువతి ని వివాహం చేసుకున్నాడు.  ఆమె మహా గయ్యాళి గంప.  అనునిత్యం భర్తను వేధిస్తుండేది.  భర్త ఏ పని చెప్పినా దానికి వ్యతిరేకంగా చేస్తుండేది.  హాయిగా ఉన్న  బ్రహ్మచర్యాన్ని విసర్జించి ఎందుకు పెళ్లి చేసుకున్నానురా దేవుడా అని రోజూ  బాధ పడుతుండేవాడు.  

ఒకరోజు తన గురువు అయిన కౌండిన్యముని దగ్గరకు వెళ్లి తన గోడును వెళ్ళబోసుకున్నాడు.  అప్పుడాయన ఆలోచించి "అలా అయితే, నువ్వు ఏమి చెప్పదలచుకున్నావో, సరిగ్గా దానికి వ్యతిరేకంగా ఆమెకు చెయ్యమని చెప్పు" అని సలహా ఇచ్చాడు గురువు. 

ఉద్దాలకుడు ఇంటికి వచ్చిన తరువాత "ఇవాళ వంట చెయ్యవద్దు"  అని చండిక తో  చెప్పాడు.  ఆమె వెంటనే పంచభక్ష్య పరమాన్నాలతో వంట చేసింది.  "నాకు వడ్డించవద్దు"  అని చెప్పాడు.  ఆమె వెంటనే  వెండి విస్తరిలో పదార్ధాలను వడ్డించింది.  ఉద్దాలకుడు తృప్తిగా భోజనం చేసాడు. "రాత్రి పడకగది లోకి రావద్దు" అని చెప్పి పడకగది లోకి వెళ్ళాడు.  ఆమె రంభలా అలంకరించుకుని పడకగదిలోకి వచ్చింది.  ఈ రకంగా భార్యను దారిలోకి తెచ్చుకున్నాడు.  

 ఒక రోజు ఉద్దాలకుడి తండ్రి గారి ఆబ్దికం వచ్చింది.  "ఈరోజు నేను బ్రాహ్మణులకు భోజనానికి పిలవను."  అన్నాడు.  "బ్రాహ్మణులను పిలవకపోతే ఎలా? పిలవండి"  అన్నది చండిక కోపంగా.    "సరే.. అలాగే.." అని బ్రాహ్మణులను భోజనానికి పిలిచాడు.  "నీవు స్నానం చెయ్యకుండా పాతచీర కట్టుకుని ఒక పచ్చడి చెయ్యి చాలు"  అన్నాడు.  ఆమె శుభ్రంగా స్నానం చేసి పది రకాల పిండివంటలతో మడిగా వంట చేసింది.  "బ్రాహ్మణులకు నీవు వడ్డించవద్దు"  అన్నాడు ఉద్దాలకుడు.  ఆమె స్వయంగా బ్రాహ్మణులకు వడ్డనలు చేసింది.  

  "హమ్మయ్య... నా భార్య దారిలోకి వచ్చింది"  అని ఆనందం పట్టలేక ఆమెతో "ఈ పిండాలను తీసుకెళ్లి గోవులకు పెట్టు"  అన్నాడు గురువు గారు ఇచ్చిన సలహాను  మర్చిపోయి.  ఆమె వెంటనే పిండాలను తీసుకెళ్లి పెంటకుప్ప పై పడేసింది.  

 ఉద్దాలకుడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  ఒళ్ళంతా రగిలిపోయింది.    "దుర్మార్గురాలా...నీవు వింధ్యపర్వతం మీద శిలలా పడివుండు"  అని శపించాడు.  దాంతో ఆమె భయపడి శాపవిమోచనం చెప్పమని ఏడ్చింది.  "ధర్మరాజు యాగం చేసిన తరువాత విడిచిన గుర్రం ఎప్పుడైతో నిన్ను తొక్కుతుందో అప్పుడే నీకు శాపవిమోచనం"  అని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.

         @@@ 

 పై కథలోని నీతి ఏమిటి?  

కొందరు మగాళ్లకు దురదృష్టం కొద్దీ గయ్యాళి భార్యలు దొరుకుతారు.  దాంతో వారి సంసారం నరకప్రాయం అవుతుంది. దాన్ని తప్పించడానికి కౌండిన్యముని లాంటి వ్యక్తిత్వ వికాస నిపుణుల దగ్గరకి వెళ్తారు.  వారేదో కౌన్సిలింగ్ ఇస్తారు.  అంతమాత్రాన మనుషుల గుణాలు పూర్తిగా మారుతాయి అనుకోవడం పొరపాటు.  భార్యను ఏవిధంగా లౌక్యంగా దారిలోకి తెచ్చుకోవాలి అని కొన్ని సూత్రాలు మాత్రం వారు చెప్పగలుగుతారు.  

 కొందరు భార్యలను అతిగా ప్రేమించి తొలుత రోజుల్లో నెత్తిమీద ఎక్కించుకుంటారు.  భార్యమాటలు విని తల్లితండ్రులను నిర్లక్ష్యం చేస్తారు.  ఫలితంగా తన శ్రేయస్సు కోరే  తల్లితండ్రులు దూరం అవుతారు.  ఆ తరువాత భర్త ఇస్తున్న చనువును ఆలంబనగా చేసుకుని మేకులా తయారవుతారు భార్యలు.  భర్తకు మనశ్శాంతి లేకుండా చేస్తారు.  ఇంటా బయటా ఎవరికీ చెప్పుకోలేక మగాడు పడే మానసిక వేదన వర్ణనాతీతం గా ఉంటుంది.  

  చివరకు శాపం పెట్టడం అనేది ఈనాటి కోర్టుకెక్కి విడాకులు తీసుకోవడం లాంటిది.  పరిస్థితి అంతవరకూ రాకుండా, అటు భార్యను, ఇటు తన తల్లితండ్రులను అదుపులో పెట్టుకోవడంలో భర్త చాకచక్యం చూపించాలి. లేకపోతె ప్రతి భర్తా మరో ఉద్దాలకుడు అవుతాడు.  "అలివిగాని ఆలిని కట్టుకుని మురిగి చచ్చెరా ముండాకొడుకు"  అనే సామెత ఉన్నది మనకు.

కామెంట్‌లు లేవు: