ss

ss
my

10, మే 2020, ఆదివారం

నక్షత్రకుడు

నక్షత్రకుడు 

@@@

మార్కండేయ పురాణం లోని ఒక ఆసక్తిదాయకమైన పాత్ర నక్షత్రకుడు.  

ఇతను విశ్వామిత్ర మహర్షి శిష్యుడు.  హరిశ్చంద్రుడు తనకు వాగ్దానం చేసిన డబ్బును రాబట్టడానికి హరిశ్చంద్రునికి తోడుగా నక్షత్రకుడిని పంపిస్తాడు.  అయితే.. హరిశ్చంద్రుడి చేత ఒక చిన్న అబద్దం ఆడించి వ్రతభంగం చేయించడం విశ్వామిత్రుడి లక్ష్యం. విశ్వామిత్రుడికి   తాను ఇస్తానన్న సొమ్ము విలువకు   రాజ్యం మొత్తం విశ్వామిత్రుడికి ధారపోసినా సరిపోలేదు.    దాంతో రాజ్యం వదిలేసి  భార్యాబిడ్డలతో కలిసి అరణ్యానికి వెళ్తాడు.  

ఇంకా కొంత ధనం బాకీ ఉండటంతో దాన్ని వసూలు చెయ్యమని నక్షత్రకుడిని పంపుతాడు.   నక్షత్రకుడు హరిశ్చంద్రుడిని క్షణక్షణం వేధిస్తూ ఉంటాడు.  వారు నడుస్తున్న సమయంలో నేను నడవలేను అని కూలబడతాడు.  కొడుకుని భుజాల మీద నుంచి దించి తనను ఎత్తుకోమంటాడు.  హరిశ్చంద్రుడు అలసిపోయి ఒక క్షణం కూర్చుంటే తన సమయాన్ని వృధా చేస్తున్నావు అని నిందిస్తాడు. ఎక్కడా నీరు దొరకని చోట తనకు అర్జెంట్ గా మంచినీళ్లు కావాలంటాడు. మధ్య మధ్యన "ఆ డబ్బు నేను ఇవ్వలేను అని ఒక్క మాట చెప్తే వెనక్కు వెళ్ళిపోతా"  అంటాడు.  కానీ హరిశ్చంద్రుడు అంగీకరించడు. 

 అప్పు తీర్చడం కోసం భార్యను అమ్మేస్తాడు హరిశ్చంద్రుడు.  ఆ డబ్బుకు వడ్డీ కూడా కావాలని నక్షత్రకుడు పీడిస్తాడు.  ఇక నా దగ్గర ఏమీ లేదు అని హరిశ్చంద్రుడు అనగానే "నిన్ను అమ్మి వడ్డీ కింద జమ వేసుకుంటా"  అని అతనిని ఒక కాటికాపరికి అమ్మేసి ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు.  

   ***  

ఇక్కడ నక్షత్రకుని ఒక వ్యక్తిగా చూడకూడదు.  తీర్చలేని అప్పు చెయ్యడం, వడ్డీలు కట్టడం, పెద్దగా పరిచయం లేని వారికే కాక, ఉన్నవారికి, బంధువులకు కూడా హామీగా ఉండి  ఋణ పత్రాల మీద హామీ సంతకాలు చెయ్యడం,  ఆ తరువాత అప్పులు తీర్చలేక, ఇంట్లో ఉన్న బంగారం, ఇల్లు కూడా అమ్మేసే వారు మనకు సమాజం లో ఎందరో కనిపిస్తారు.  అప్పు చేస్తే ఎలాంటి బాధలు చుట్టుముడతాయో, ఋణదాతల నుంచి ఎలాంటి భయంకరమైన వేధింపులు ఉంటాయో, చివరకు భార్యాపిల్లలను కూడా పోగొట్టుకోవడమే కాక, తానూ ఆత్మహత్యకు పాల్పడవలసి  వస్తుందో చెప్పడానికి నక్షత్రక పాత్రను  ఒక ప్రతీక గా భావించాలి. 

  అప్పులు చెయ్యవచ్చు.  ఎలాంటివి?  ఇల్లు, స్థలం, బంగారం కొనుక్కోవడానికి అప్పులు చెయ్యవచ్చు.  రేపు కథ అడ్డం తిరిగినప్పుడు వాటిని అమ్మి అయినా అప్పులు తీర్చి బయటపడవచ్చు.  కానీ, తాహతు లేకపోయినా, దర్జా కోసం, విలాసాల కోసం, నలుగురితో  ఘనంగా చేశాడు అనిపించుకోవడానికి అప్పులు చేసి శుభకార్యాలు చెయ్యడం లాంటివి మనిషిని పాతాళం లోకి తోసేస్తాయి.  "అప్పుల బాధ భరించలేక కుటుంబం ఆత్మహత్య"  అనే వార్తలు పత్రికల్లో చూస్తుంటాము.  వాటి వెనుక అనవసరమైన అప్పులు చెయ్యడం కూడా ఒకటి.  అప్పులు చేసేవాడు ఎప్పుడూ తప్పించుకుని తిరుగుతుంటాడు.  

  మన శక్తి, తాహతు గ్రహించుకుని వీలైనంతవరకూ అప్పులు చెయ్యకుండా, ఇతరులతో మాట పడకుండా, గౌరవంగా జీవించేవాడే జీవితంలో సుఖపడతాడు. "అప్పులు చేయకురా నరుడా, తిప్పలు తప్పవురా"  అని అప్పలాచార్య ఒక పాట కూడా రాశారు.  కనుక పనికిమాలిన అప్పులు చేసేవారు ఎప్పుడూ హరిశ్చంద్రుడు పాత్రను స్మరించుకోవాలి.  

 అలాగే షూరిటీ సంతకాలు చేసి ఇరుక్కుపోయేవారు కూడా అనేకమంది కనిపిస్తారు.  మిత్రుడు అని నమ్మి షూరిటీ సంతకం చేసిన పాపానికి తమ సంపాదన మొత్తం వేరేవారు చేసిన అప్పులు తీర్చడానికే ఖర్చు చేసిన వారు నాకు ఎంతోమంది తెలుసు.  కనుక అందరూ జాగరూకతతో మెలగాలి అని నక్షత్రకుడి కథ మనకు బోధిస్తున్నది.

కామెంట్‌లు లేవు: