ss

ss
my

10, మే 2020, ఆదివారం

నహుషుడు

నహుషుడు 

@@@

 
  ఇది మహాభారతం లోని ఒక కథ.  

 నహుషుడు ఆయువు అనే రాజు కుమారుడు.  ఇతనికి యతి, యయాతి, సంయాతి, మొదలగు అయిదుగురు పుత్రులు జన్మించారు.  ఇతను నూరు యజ్ఞాలు చేసాడు.  దాంతో ఇతనికి దేవత్వం లభించింది.  అంటే దేవతలతో సమానుడు.  ఇంద్రపదవి ఖాళీ అయితే, ఆ పదవికి నూరు యజ్ఞాలు చేసిన  వారు  అర్హులు  అప్పటి చట్టాల ప్రకారం. ఇప్పటి చట్టాల ప్రకారం   ముఖ్యమంత్రి కావాలన్నా, ప్రధానమంత్రి కావాలన్నా, మంత్రి కావాలన్నా, చట్టసభలలో ఎదో ఒకదానికి ఎన్నిక కావాలి.  అవకాశం వస్తే అలాంటి వాడు ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి పదవులకు ఎలా అర్హులో అలా అన్నమాట.   

  అదేసమయం లో అప్పటి ఇంద్ర పదవి లో ఉన్న వాడు బ్రహ్మ హత్యా పాతకానికి పాల్పడ్డాడు.  దాంతో శిక్షను తప్పించుకోవడానికి స్వర్గలోక వదిలి పారిపోయాడు. మరి దేవేంద్రులు లేకపోతె స్వర్గలోక పాలన ఎలాగా?  పైగా ఆ పదవికి నూరు యాగాలు చేసిన వాడే అర్హుడాయే.  అప్పుడు దేవతలు అందరూ దుర్భిణీ వేసి వెతికితే, భూలోకం లో నహుషుడు కనిపించాడు.  దేవతలంతా తరలివచ్చి నహుషుడిని బతిమాలి దేవేంద్ర పదవి మీద కూర్చోబెట్టి, తమ దైవత్వ శక్తులు అన్ని అతనికి ధారపోశారు. దాంతో నహుషునికి విపరీరమైన గర్వం, అహంభావం ఆవరించి దిక్పాలకులను, ఋషులను, మునులను, ఇతర దేవతలను తీవ్రంగా అవమానిస్తూ ప్రవర్తిస్తున్నాడు.  

  ఒకరోజు నహుషుడు ఇంద్రభవనం లోకి వెళ్ళగానే అక్కడ శచీదేవి కనిపించింది. ఆమె పారిపోయిన ఇంద్రుడి భార్య.    ఆమె అందాన్ని చూసి నహుషుడు మోహించి తన గదిలోకి రావాలని కోరాడు.  ఆమె గబగబా బృహస్పతి దగ్గరకు వెళ్లి సలహా అడిగింది.  ఆయన ఒక ఉపాయం చెప్పాడు.  ఆ ఉపాయం ప్రకారం... నహుషుడితో " ఋషులు, మునులు నిన్ను పల్లకిలో కూర్చోబెట్టి మోస్తూ నా మందిరానికి వస్తే నీ కోరిక తీరుస్తా"  అన్నది. 

  కామాంధుడైన నహుషుడు అక్కడున్న అగస్త్యుడు, అత్రి, వశిష్ఠుడు,  దుర్వాసుడు లాంటి మునులతో తన పల్లకి మొయ్యాలని ఆజ్ఞాపించాడు.  వారు ఆగ్రహంతో నిరాకరించారు. అధికారమదం తో విర్రవీగుతున్న నహుషుడు అగస్త్యుడిని తన కాలితో తలమీద తన్నాడు.  అగస్త్యుడు కోపావేశుడై "మదించిన సర్పం అమాయకుడిని కాటువేసినట్లు నన్ను తన్నావు.  నీవు సర్పం అయిపోవాలని శపిస్తున్నాను" అని జలప్రోక్షణ చేసాడు.  

  వెంటనే నహుషుడు పాముగా మారిపోయి తన తప్పు తెలుసుకుని శాపవిమోచనం కోరాడు.  "నువ్వు సర్పంలా తిరుగుతున్నప్పుడు ఎవడైనా నీ చేతికి చిక్కితే నువ్వు వాడిని కొన్ని ప్రశ్నలు వెయ్యాలి.  నీ ప్రశ్నలకు అతడు సరైన జవాబులు ఇస్తే నీకు శాపవిమోచనం అవుతుంది."  అని చెప్పాడు.  

  సర్ప జన్మతో యితడు అడవులలో తిరుగుతుండగా భీమసేనుడు అడవికి వచ్చి ఇతడి చేతికి చిక్కాడు.  ఇతను అడిగిన ప్రశ్నలకు భీముడు జవాబు చెప్పలేక బందీగా ఉంటాడు.  అప్పడు భీముడిని వెతుక్కుంటూ ధర్మరాజు వచ్చి సర్పం  చేతిలో చిక్కిన భీముడిని చూసి ప్రశ్నలన్నింటికీ సరైన జవాబులు చెప్పడం తో ఇతనికి శాపవిమోచనం అయి పూర్వ రూపం వస్తుంది.  

             ****

పై కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి?  

 అకస్మాత్తుగా ఐశ్వర్యం లభించినా, అధికారయోగం పట్టినా అయోగ్యులకు మదాంధత హెచ్చుతుంది.  అప్పటివరకు ఆత్మీయంగా ఉన్న స్నేహితులను, బంధువులను, చివరకు కుటుంబ సభ్యులను కూడా అవమానిస్తుంటాడు. గతం లో తాను చాయ్ అమ్మి బతికామని, పాలుపెరుగు అమ్ముకున్నామని, సైకిళ్లకు పంచర్లు వేసుకుని నాలుగు రూకలు సంపాదించామని, కూరగాయలు అమ్ముకుని లేదా చిరు ఉద్యోగం  చేసుకుని   గడిపిన పేదరిక జీవితం విస్మరించి  పదవిలోకి రాగానే తన గతం మర్చిపోయి తాను సర్వజ్ఞుడిని అని విర్రవీగుతుంటాడు.  తాను చెప్పిందే వేదం అని అహాంత్వం తో చెలరేగుతాడు.  మహాపండితులకు నీతులు బోధిస్తాడు. తనకు ఎక్కాలు రాకపోయినా,  పెద్ద పెద్ద ఆర్ధికవేత్తలకు ఆర్థికశాస్త్రము గూర్చి  చెప్తాడు.  తనకు అ, ఆ లు రాకపోయినా, ప్రొఫెసర్లకు పాఠాలు చెప్తాడు.     తనకంటే ఉన్నతులను లెక్కచేయడు.  అతడి అధికారాన్ని చూసి భయంతో అణిగి ఉంటారు అందరూ.   చివరకు ప్రజాగ్రహానికి గురి అయి పదవులను కోల్పోతారు.

  అతని గర్వాంధతకు కినిసినా, పదవి పట్ల భయపడి అప్పటికప్పుడు ఏమీ అనలేకపోయినా, అతని చేత అవమానించబడినవారు అతని పతనం కోసం ఎదురు చూస్తుంటారు.  అతని పదవి పోగానే, అతగాడిని వీధుల్లో తిరిగే కుక్కలు కూడా లెక్క చెయ్యవు.  ఇలాంటి వారందరూ నహుషుల కోవలోకి వస్తారు.  

  కాబట్టి మనిషి ఎంత సాధించినా, ఎంత సంపాదించినా, ఎంత యోగం పట్టినా, గర్వం పనికి రాదు.  ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు సమాజం ఆదరణ పొందుతాడు.  ఎదుటి వ్యక్తులు మనకంటే తక్కువ స్థాయి వారు అయినా, చదువుసంధ్యలు లేనివారు అయినా, నిర్భాగ్యులు అయినా, అందరినీ సమగౌరవం తో చూసినవాడు ఉత్తమపురుషుడు అవుతాడు.  నడమంత్రపు సిరి నరం మీద పుండు అని మన పెద్దలు అన్నారు కదా...

కామెంట్‌లు లేవు: