ss

ss
my

10, మే 2020, ఆదివారం

దీర్ఘతముడు

దీర్ఘతముడు 

@@@

మన పురాణాల లోని కొన్ని కథలు వింటుంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి.  అలాంటిదే దీర్ఘతముడి కథ.  ఇది భారతం లోనిది.  

దీర్ఘతముడు ఉతధ్వుడు అనే ముని కుమారుడు.  ఇతని తల్లి మమత.  ఇతడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తండ్రి లేని సమయం లో దేవగురువు బృహస్పతి ఇతని తల్లిని బలాత్కారం గా అనుభవించాడు.  ఇప్పటి భాషలో చెప్పాలంటే మానభంగం చేసాడు.  గర్భస్థ శిశువుగా  ఉన్న దీర్ఘతముడు ఆగ్రహంతో బృహస్పతిని నిందించాడు.  బృహస్పతికి కోపం వచ్చి "బుద్ధికి అధిపతిని, దేవగురువును అయిన నన్నే నిందించేంత ఘనుడివా?  నువ్వు దీర్ఘతముడివి అవుదువు గాక"  అని శపించాడు.  ఆ శాప ఫలితంగా ఇతడు అంధుడిగా జన్మించాడు.  

  గుడ్డివాడే అయినప్పటికీ, యితడు వేదవేదాంగాలను అభ్యసించాడు.  మహా పండితుడు అయ్యాడు.  పెళ్లీడు రాగానే ప్రద్వేషిణి అనే యువతిని వివాహం చేసుకున్నాడు.  పిల్లలు కూడా కలిగారు.  అయితే ఆమె అస్తమానం ఇతడిని విసుక్కుంటూ ఉండేది.  "ఎందుకు నాపై కోపం?  నీకు సుఖాలను,  సంతానాన్ని ఇచ్చానుగా?"  అడిగాడు దీర్ఘతముడు.  

"భర్త అంటే భరించేవాడు.  కానీ నీవు మామీద ఆధారపడి జీవిస్తున్నావు.  ఇక నిన్ను మేపటం మావల్ల కాదు.  ఇంట్లోంచి వెళ్ళిపో"  అని కసిరింది.  

  దీర్ఘతముడికి ఆగ్రహం కలిగింది.  "భర్తనే ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటావా?  నేను ఆశక్తుడినని, అంధుడినని  పెళ్లికి ముందు తెలియదా?   భర్తను పోగొట్టుకున్న స్త్రీ మాంగల్యానికి, అలంకారాలకు దూరం అగుదురు గాక"  అని శపించాడు.  ప్రద్వేషిణికి కోపం వచ్చి కొడుకులను పిలిచి "మీ నాన్నను గంగానదిలో పడేసి రండి" అని ఆజ్ఞాపించింది.  కొడుకులు వెంటనే తండ్రి అనికూడా చూడకుండా దీర్ఘతముడిని బంధించి  గంగానదిలో పడేసి వచ్చారు.  

ప్రవాహంలో కొట్టుకునిపోతున్న దీర్ఘతముడ్ని బలి అనే రాజు రక్షించి తన ఇంటికి తీసుకెళ్తాడు.  యితడు మహా పండితుడు అనితెలుస్కున్న బలి "నా భార్యకు సంతానం లేదు.  మీరు ఆమెను  అనుగ్రహించాలి" అని కోరాడు.  

అయితే, రాజుగారి భార్య గుడ్డివాడైన దీర్ఘతముడి దగ్గరకు వెళ్ళడానికి అసహ్యించుకుని తన దాసీని పంపింది.   దీర్ఘతముడి సంగమంతో  ఆమెకు సంతానం కలిగారు.  వాళ్ళు తన భార్య గర్భాన జనించిన  పుత్రులే అని బలి సంతోషిస్తున్నాడు.  అయితే దీర్ఘతముడు రాజుతో వాళ్ళు దాసీ పుత్రులు అని చెప్పాడు.  రాజు ఖిన్నుడై తన భార్యను ఒప్పించి దీర్ఘతముడి దగ్గరకు పంపుతాడు.  ఇతడి వలన ఆమెకు అంగరాజు అనే కొడుకు జన్మించాడు,  

             *****  

 ఈ కథ చదివిన తరువాత కొంత గందరగోళంగా ఉంటుంది.  కానీ వాస్తవాలు,  జీవితసత్యాలు  మాత్రం విభ్రమ గొలుపుతాయి.  

1 .  సంపాదన లేని భర్తను భార్య కూడా గౌరవించదు.  పిల్లలు గౌరవించరు. 

2 .  మగవాడు సంపాదించనీ, సంపాదించక పోనీ, పిల్లలు ఎప్పుడైనా తండ్రి కంటే తల్లి మాటకే విలువ ఇస్తారు.  

3 .  వైధవ్యం ప్రాప్టించిన స్త్రీలు మంగళసూత్రం ధరించకపోవడానికి దీర్ఘతముని శాపమే కారణం. 

4 .  ఇవాళ మనం అద్భుతం, విజ్ఞానాభివృద్ది అని చెప్పుకునే సరోగసి .. అనగా అద్దె గర్భం ద్వారా సంతానం కలిగించడం మన పురాణకాలం లోనే ఉన్నది.  దీర్ఘతముడి వంటి వీర్యశక్తి కలిగిన వారి నుంచి వీర్యం సేకరించి స్త్రీ యొక్క అండాశయం లో ప్రవేశ పెట్టి గర్భం కలిగించడం అనే శాస్త్రం మనదేశం లో అప్పట్లోనే ఉన్నదని మనం గ్రహించాలి.  

ఇప్పుడు చెప్పండి...మన పురాణాలలో లేని విజ్ఞానం పాశ్చాత్త్య దేశాల్లో ఉన్నదంటారా?

కామెంట్‌లు లేవు: