ss

ss
my

14, మే 2020, గురువారం

పలితుడు

పలితుడు 

@@@

రాజు దుర్బలుడు అయినపుడు బలవంతుడైన శత్రువును ఎలా ఎదుర్కోవాలి? అని  ధర్మరాజు ఒకసారి భీష్మణాచార్యుడిని ప్రశ్నించినపుడు ఆ కురువృద్ధుడు ఈ గాధను చెప్పాడట.  ఇది ఒకరకమైన యుద్ధ వ్యూహం.  

పలితుడు అనే ఎలుక ఒక చెట్టు కింద బొరియను నిర్మించుకుని నివసిస్తున్నది.  ఆ చెట్టు పైన రోమశుడు అనే మార్జాలం నివసిస్తున్నది.  ఒకరోజు ఒక వేటగాడు ఆ చెట్టుకింద పిట్టల కోసం వలను పన్ని వెళ్ళిపోయాడు.  ఆ రాత్రి చీకట్లో మార్జాలం చెట్టుపైకి వెళ్ళబోతూ ఆ వలలో చిక్కుకున్నది.  రాత్రివేళ ఎలుక ఆహారం కోసం బయటకు వచ్చింది.  అప్పుడే ఆ చెట్టు కొమ్మ మీద ఒక గుడ్లగూబ, ఒక ముంగిస దాన్ని చూశాయి.  ఆ రెండు జంతువులనుంచి ప్రాణాలతో తప్పించుకుని వెళ్లడం అసంభవం అని గ్రహించిన ఎలుక...   వలదగ్గరకి వెళ్లి పిల్లితో నేను ఈ వల తాళ్లను కొరికి నిన్ను రక్షిస్తాను.  కానీ పైన కొమ్మ మీద గుడ్లగూబ, ముంగిస నన్ను చూశాయి.  బయటకు వేస్తె నన్ను తినేస్తాయి"  అన్నది.  అపుడు పిల్లి పెద్దగా అరిచింది.  పిల్లి అక్కడ ఉన్న సంగతి గ్రహించిన గుడ్లగూబ, ముంగిస పిల్లిని చూసి భయపడి పారిపోయాయి.  ఎందుకంటే పిల్లికి ఆ రెండు జంతువులూ ఆహారమే.  

  "హమ్మయ్య... అనుకుని ఎలుక ఈల వేసుకుంటూ  ఆహారం తిని మళ్ళీ బొరియ దగ్గరకు వచ్చింది.  పిల్లి కోపంగా "నీ ప్రాణాలను రక్షించాను.  కానీ నువ్వు మాత్రం కృతఘ్నత తో నన్ను రక్షించకుండా వెళ్ళిపోయావు.  తొందరగా ఈ తాళ్లను తెంచు"  అన్నది.  

  ఎలుక నవ్వి "ఈ తాళ్లను ఇప్పుడే కొరికితే ఆకలితో నకనకలాడుతున్న   నువ్వు  ముందు నన్ను తినేస్తావు.  కొంచెం సేపు ఆగు.  బోయవాడు వస్తుండగా వలను కొరుకుతాను.  అప్పుడు నువ్వు ప్రాణభయం తో పారిపోతావు కాబట్టి నాకు ప్రమాదం ఉండదు." అని బొరియ లోపలి వెళ్ళింది.  

  తెల్లవారిన తరువాత బోయవాడు వస్తుండగా ఎలుక వల దగ్గరకు వచ్చినది.   పిల్లి ప్రాణభయంతో వణికి పోతున్నది.   అప్పుడు మూషికం గబగబా  తాళ్లను కొరికింది.  పిల్లి ప్రాణభయం తో పారిపోయింది.  ఎలుక మళ్ళీ కలుగు లోకి వెళ్ళిపోయింది.  వేటగాడు వలను తీసుకుని వెళ్ళాక మెల్లగా పిల్లి ఎలుక బొరియ దగ్గరకి వచ్చి "మిత్రుడా...నా ప్రాణాలను రక్షించావు.  నిన్ను సన్మానిస్తాను.  బయటకి రా"  అన్నది.  

 అప్పుడు ఎలుక కలుగు లోనించి రాకుండా "నిన్ను నమ్మడమా?  అసంభవం.  రాత్రంతా ఆకలితో మాడిపోయి ఉన్నావు.  నేను బయటకి వస్తే ముందు నువ్వు నన్ను తిని ఆకలి తీర్చుకుంటావు.  వెళ్ళు వెళ్ళు "  అన్నది హేళనగా.

  తన పధకం పారకపోవడం తో పిల్లి నిరాశగా వెళ్ళిపోయింది.  

                   @@@  

 పై కథనుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి?  

నేటి పచ్చి అవకాశవాద రాజకీయాలకు ప్రతీక ఈ పలితుడు-రోమశుడి గాథ.   

  2004  లో బీజేపీ తో కలిసి తెలుగుదేశం పోటీ చేసింది.  ఎన్నికలలో ఓడిపోగానే పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నారు.  ఒకరిముఖం మరొకరు చూడబోమని శపధాలు చేసుకున్నారు.  2014  లో మళ్ళీ ఇద్దరు దగ్గరయ్యారు.  ఇక కమ్యూనిస్టు పార్టీలు తెలుగుదేశం తో ఎన్ని సార్లు పొత్తు పెట్టుకున్నారో, ఎన్నిసార్లు విడిపోయారో ఆ దేవుడికే తెలియాలి.  

  మనదగ్గరే కాదు. దేశమంతా ఇలాగే ఉన్నది.  నితీష్ కుమార్, మాయావతి, ములాయం, కరుణానిధి, జయలలిత, వైగో, ఎన్నెన్ని పార్టీలతో కలిసారో, ఎన్నెన్ని పార్టీలతో విడిపోయారో లెక్కే లేదు.  అక్కడ ఉన్నది ఒకటే లెక్క.  శత్రువు శత్రువు మిత్రుడు అనే లెక్క మాత్రమే.  సిద్ధాంతాలు లేవు, సిగ్గెగ్గులు లేవు.  మానాభిమానాలు లేవు. ఒకరిమీద మరొకరికి విశ్వాసం లేదు.   అంతా పచ్చి అవకాశవాదం. ఇలాంటి నాయకులు అందరూ కలియుగ పలితులు, రోమశులు అన్నమాట...అవసరార్ధం కలుస్తారు.  అవసరాలు తీరాక పొట్లాడుకుని కత్తులు దూసుకుంటారు.

ఇది భారతం లోని కథ.  భారతం లో లేనివి ప్రపంచం లో లేవు.  ప్రపంచంలో ఉన్నవి అన్నీ భారతం లో ఉన్నాయి అంటే ఇదే మరి.

కామెంట్‌లు లేవు: