ss

ss
my

29, ఆగస్టు 2009, శనివారం

తెలుగు లిపి

తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన దక్షిణ బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది.

అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. దక్షిణ భారతదేశములో బ్రాహ్మీ లిపి లో వ్రాసిన అక్షరములు మొదట భట్టిప్రోలు లో దొరికాయి. అచటి బౌద్ధస్తూపములో దొరికిన ధాతుకరండముపై మౌర్యకాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి. ఈ లిపిని భాషాకారులు భట్టిప్రోలు లిపి అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నియూ ఈ లిపినుండే పరిణామము చెందాయి.

ఆవిర్భావము

తీరాంధ్రప్రాంతము, కృష్ణా నదీ తీరమున ఉన్న భట్టిప్రోలు గ్రామమందు క్రీ.పూ. 5వ శతాబ్దములో గొప్ప బౌద్ధస్తూపము నిర్మించబడినది . ఆ సమయములో బౌద్ధమతముతో బాటు మౌర్యుల కాలములో వాడుకలో నున్న బ్రాహ్మీ లిపి కూడ అచటకు చేరినది. ఈ లిపి దగ్గరలోనున్న ఘంటసాల, మచిలీపట్నం రేవులనుండి తూర్పు ఆసియా లోని బర్మా, థాయిల్యాండ్, లావోస్ మొదలగు దేశాలకు కూడ చేరి అచటి లిపుల ఆవిర్భామునకు కారణభూతమయింది. క్రీ.శ. ఐదవ శతాబ్దము నాటికి భట్టిప్రోలు లిపి పాత తెలుగు లిపిగా పరిణామము చెందింది.

మౌర్యులకాలపు (క్రీ.పూ. 3వ శతాబ్ది) బ్రాహ్మీలిపి పట్టికలోని రెండవ వరుసలో ఇవ్వబడినది. అటు పిమ్మట భట్టిప్రోలు ధాతుకరండముపై కొద్దిమార్పులుగల బ్రాహ్మీలిపి మూడవ వరుసలో చూడవచ్చును.

తెలుగు శాసనములు

శాతవాహనుల శాసనములు
శాతవాహనుల శాసనములలోని (క్రీ. శ 1వ శతాబ్ది) భట్టిప్రోలు లిపి పరిణామము 4వ వరుసలో ఇవ్వబడింది.

ఇక్ష్వాకుల శాసనములు
క్రీ.శ. 218 లో శాతవాహనుల సామంతులు ఇక్ష్వాకులు స్వతంత్రులైరి. వారికాలమునాటి లిపి 5వ వరుసలో గలదు

శాలంకాయన నందివర్మ శాసనము
ఇక్ష్వాకుల తరువాత శాలంకాయనులు ఆంధ్ర దేశాన్ని క్రీ. శ. 300 నుండి 420 వరకు పాలించారు. శాలంకాయనుల రాజధాని వేంగి. ఆకాలమునాటి లిపి 7వ వరుసలోనున్నది. ఈ కాలములోనే తెలుగు లిపి మిగిలిన దక్షిణ భారత మరియు ఉత్తర భారత లిపులనుండి వేరుపడుట ప్రారంభమయింది. క్రీ. శ. 420-611 మధ్యకాలములో విష్ణుకుండినులు వినుకొండ రాజధానిగా పరిపాలించారు.

విష్ణుకుండిన శాసనములు
విష్ణుకుండినుల పరిపాలనాకాలములో భాషల వాడుకలో, వ్రాతలో పలుమార్పులు వచ్చాయి. ప్రాకృతము బదులు సంస్కృతము వాడుట ఎక్కువయ్యింది. అదేసమయములో రాయలసీమను పాలించిన రేనాటి చోళులు రాజశాసనములు తెలుగులో వ్రాయించారు. మనకు దొరికిన వారి మొదటి శాసనము క్రీ. శ. 573 నాటిది. తీరాంధ్రప్రాంతములో దొరికిన క్రీ. శ 633 నాటి శాసనము మొదటిది. అప్పటినుండి తెలుగు వాడకము బాగా ఎక్కువయింది.

పల్లవ నరసింహవర్మ శాసనము
శాతవాహనులకు సామంతులుగానున్న పల్లవులు మొదట పల్నాడులో స్వతంత్రులై పిమ్మట ఉత్తర తమిళదేశములోని కంచిలో స్థిరపడ్డారు. తొలుత దొరికిన శాసనములు తమిళములో ఉన్నా, పిమ్మట పల్లవులు సంస్కృతమును, భారవి, దండి లాంటి సంస్కృత కవులను ఆదరించారు. శాసనాలు "పల్లవ గ్రంథం" అనబడు లిపిలో వ్రాయించారు. 8వ వరుసలో ఈలిపిని చూడవచ్చును. ఆధునిక తమిళ లిపి దీనినుండే పరిణామము చెందింది.

పరిణామము
భాషాపరంగా కన్నడ తమిళ భాషలు దక్షిణ ద్రావిడ కుటుంబానికి చెందినవి. కాని, చారిత్రకంగా ఆంధ్ర శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు ఆంధ్ర కర్నాట దేశాలను పాలించడంవల్ల తెలుగు, కన్నడ భాషల లిపి ఉమ్మడిగా పరిణామము చెందింది. శాతవాహనుల కాలములోనే భట్టిప్రోలు లిపి కర్ణాట దేశానికి వ్యాప్తి చెందింది. ఆంధ్రదేశము, వేంగీ విషయము, కమ్మనాడు, పుంగనూరు వాస్తవ్యుడైన పంప అనే బ్రాహ్మణపండితుడు జైనమతావలంబియై వేములవాడను పాలించిన అరికేసరి అను చాళుక్య రాజు ఆశ్రయముపొంది విక్రమార్కవిజయము అనబడు తొలి కన్నడ గ్రంథము వ్రాశాడు. తెలుగు కన్నడ లిపులు ముడిపడి ఉండడానికి ఇలాంటి కారణాలు కొన్నిఉన్నాయి. వరుసలు 9, 10 మరియు 11 చాళుక్యుల కాలము (7, 10 మరియు 11వ శతాబ్దములు) నాటి లిపులను సూచిస్తునాయి. 10, 11 వరుసలలోని లిపిని వేంగీలిపి అనికూడ అంటారు. 12వ వరుసలో కాకతీయుల కాలమునాటి లిపిచూడవచ్చు. ఈ కాలములో తెలుగు భాష, సాహిత్యములు ప్రజ్వరిల్లాయి. 13, 14 వరుసలలో మహాకవి శ్రీనాథుని కాలము నాటి లిపి, చివరి వరుసలో విజయనగరకాలము నాటి తెలుగు-కన్నడ ఉమ్మడి లిపి చూడవచ్చు. అధునిక తెలుగు లిపికిది చివరి పరిణామదశ.

కామెంట్‌లు లేవు: